గ్రేటర్ ఎన్నికల బరిలో అక్బరుద్దీన్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరి పక్షాలకు అనుకోని వరంలా మారాయి. పీవీ, ఎన్టీఆర్ ఘాట్ ల గురించి అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యల్ని అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ తీవ్రంగా ఖండించాయి. కాంగ్రెస్ కూడా నిశితంగా విమర్శించింది. ఇక టీడీపీ ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలకు దిగింది. దీంతో అక్బర్ వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి.

వాస్తవానికి హైదరాబాద్ నగరంలో జరిగిన ఆక్రమణల గురించి ప్రస్తావిస్తూ.. హుస్సేన్ సాగర్ పరిధి రోజు రోజుకీ కుంచించుకు పోతోందని, దానికి కారణం గత పాలకులేనని విమర్శించారు అక్బరుద్దీన్ ఒవైసీ. ఆ క్రమంలో ఎన్టీఆర్, పీవీలపై మాట తూలారు. దీంతో టీఆర్ఎస్ సహా ఇతర పార్టీలన్నీ ఆయనపై విరుచుకు పడ్డాయి. అక్బరుద్దీన్ వ్యాఖ్యలతో ఎంఐఎంకి వచ్చే నష్టమేదైనా ఉందా అనే అనుమానం అందరిలో బయలుదేరింది. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ఆ పార్టీకి నష్టం కలిగించడంతోపాటు.. ఇతర పార్టీల్లో దేనికి లాభం చేకురుస్తాయో అనే చర్చ కూడా మొదలైంది. అక్బర్ వ్యాఖ్యలతో బీజేపీకీ లాభమా, లేక టీఆర్ఎస్ పుంజుకుంటుందా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

పోయిన దఫా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 స్థానాల జీహెచ్ఎంసీలో ఎంఐఎం 44సీట్లు కైవసం చేసుకుంది. దాదాపుగా ఈ సీట్లన్నిటిలో ఇప్పటికీ ఆ పార్టీకి తిరుగులేని మెజార్టీ వస్తుంది. అయితే అంతకు మించిన స్థానాలు సాధించాలనేది ఎంఐఎం ఆలోచన. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని చూస్తోంది. అలాంటి సందర్భంలో అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ఆ పార్టీకి నష్టాన్ని కలిగిస్తాయనడంలో సందేహం లేదు. అదే సమయంలో గతంలో గెలిచిన 44 స్థానాల్లో మాత్రం ఎంఐఎం విజయాలకు ఎలాంటి ఢోకా లేదు. కొత్తగా ఎంఐఎం పోటీ చేసే స్థానాల్లో మాత్రం ఆ పార్టీకి పెద్దగా ఉపయోగం ఉండదు. మైనార్టీల ఓటు బ్యాంకు బలంగా ఉన్న ఎంఐఎం పార్టీ 44 డివిజన్లలో నిర్ణయాత్మక శక్తిగా ఉంది. ఆయా స్థానాల్లో ఈ దఫా కూడా విజయకేతనం ఎగరేస్తామంటున్నారు ఎంఐఎం అభ్యర్థులు.

మరింత సమాచారం తెలుసుకోండి: