జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మత విద్వేషపూరిత వ్యాఖ్యాలు చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో భాగంగా నేరచరిత్ర కలిగిన కొందరు వ్యక్తులు వ్యక్తిగతంగా ఈ కుట్రలకు పాల్పడుతున్నారని, ఈ కుట్రలకు ప్రయత్నిస్తున్న వారి గురించి పక్కా సమాచారం ఉందన్నారు. చిన్న అంశం కావడంతో బహిర్గతం చేయలేకపోతున్నామని, మత పరమైన కుట్రలకు పాల్పడుతూ ఆరోపణలు చేసిన వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

ఈ మేరకు అదనపు డీజీపీ జితేందర్, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్ భగవత్, సీపీ సజ్జనార్ తదితరులతో సమావేశమై.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తీసుకోవాల్సిన పటిష్ట బందోబస్తుపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో గత ఆరేళ్లుగా ఎలాంటి మత విద్వేషిత ఘటనలు చోటు చేసుకోలేదు. కానీ ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో యువతను రెచ్చగొట్టేలా ప్రసంగాల ఇస్తూ అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.’’ అని అన్నారు.

సాంకేతిక టెక్నాలజీతో వారిని నిరంతరం నిఘా పెట్టామన్నారు. అలజడులు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్న ఆ వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశామన్నారు. న్యాయనిపుణుల సూచనల మేరకు మతాలకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేస్తున్న రాజకీయ నాయకులపై కేసు కూడా నమోదు చేస్తున్నామన్నారు. సర్జికల్ స్ట్రైక్, ఎన్టీఆర్, పీవీ ఘాట్ ల కూల్చివేత వంటి విద్వేషపూరిత వ్యాఖ్యలపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

ఎన్నికల సర్వేల పేరిట కొన్ని టీవీ ఛానళ్ల లోగోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్న వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నామన్నారు. ఇప్పటికే నిబంధనలను ఉల్లంఘించిన 50 మందిపై కేసులు పెట్టామన్నారు. ప్రజలు కూడా సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు సాఫీగా జరిగేందుకు 51,500 పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక బలగాన్ని రంగంలోకి దించామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: