ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచాన్ని పాలించాలి.. దేశాలన్నీ నా ముందు మోకరిల్లాలి... ఇలంటి దుర్మార్గపు ఆలోచనలతో ప్రపంచంలో ఏ దేశమైనా ఉందా..? అనే ప్రశ్న తలెత్తగానే మనకు గుర్తొచ్చేది.. డ్రాగన్ కంట్రీ చైనా. అయితే ఇలాంటి నినాదాలేమైనా ఉన్నా అవి లోగుట్టుగానే ఉంటాయి. కానీ చైనా ఆ భయాన్ని కూడా దాటేసింది. సాక్షాత్తూ ఆ దేశ అధ్యక్షుడే స్వయంగా ఈ విషయాన్నిబహిరంగంగా ప్రకటించాడంటే ఇక వారి అహంకారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.


తాజాగా..ఆయన చైనా అధికారులకు కొత్త టార్గెట్ విధించారు. అదే.. 2027. సరిగ్గా ఏడేళ్లలో ప్రపంచస్థాయి సైనిక శక్తిగా చైనా సైన్యం అవతరించాలని, అత్యధునిక సాంకేతికతలు సంపాదించాలని అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ సైన్యానికి లక్ష్యాన్ని నిర్దేశించాడు. వాస్తవ యుద్ధాలను పోలిన పరిస్థితుల్లో సైన్యానికి శిక్షణ ఇచ్చి సైనికుల నైపుణ్యాలు పెంచాలని సూచించాడు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

దేశ మిలటరీ శక్తిని పెంచుకోవడమే తమ లక్ష్యమని చెప్పిన జిన్‌పింగ్.. ప్రపంచస్థాయి సైనిక శక్తిగా చైనా రూపాంతరం చెందేందుకు సైనిక శిక్షణా పద్ధతుల్లో మార్పు రావాలని సూచించాడు. అమెరికాతో సరితూగే సైనిక పాటవాన్ని 2027 సంవత్సరం కల్లా సంపాదించాలనే లక్ష్యాన్నపెట్టుకోవాలని ఆదేశించారు.


ఇతర దేశాలతో చైనా ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో జీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతిస్తున్నాయి. మరోవైపు.. చైనా రక్షణ రంగ బలోపేతానికి అక్కడి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకూ చైనా సైనికావసరాల కోసం 179 బలియన్ డాలర్లను కేటాయించింది. సైన్యానికి అత్యధిక నిధులు వెచ్చిస్తున్న దేశాల్లో మొదటి స్థానంలో అమెరికా ఉంటే.. రెండో స్థానం చైనాదే. 2019లో చైనా ప్రభుత్వం సైన్యం కోసం 232 బలియన్ డాలర్లు కేటాయించిందని స్టాక్ హోమ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది. అయితే చైనా విధానాలపై ఇప్పటికే అనేక దేశాలు గుర్రుగా ఉన్నాయి. చైనా విస్తరణ
వాదాన్ని ఎలాగైనా అణచివేయాలని ఒక్కటయ్యేందుకు సిద్ధపడుతున్నాయి. మనదేశంతో పాటు, ఆస్ట్రేలియా, జపాన్‌లు కూడా చైనాపై మండిపడుతున్నాయి.


విశేషం ఏంటంటే అగ్రరాజ్యం అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ కూడా చైనా పట్ల కఠిన వైఖరి అవలంబిస్తామని స్పష్టం చేశారు. అక్కడి కమ్యునిస్టు ప్రభుత్వం అంతర్జాతీయ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో జిన్‌పింగ్ ఆకాంక్షిస్తున్న మిషన్-2027 ఫలిస్తుందా..? లేక ప్రపంచ దేశాల ఆగ్రహానికి చైనా బలవుతుందా..? అనేది వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: