ఇంటర్నెట్ డెస్క్: జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జమిలి ఎన్నికల కాన్సెప్ట్ తెరమీదకొచ్చింది. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. దేశంలో జమిలి ఎన్నికలు అవసరమని, జమిలి ఎన్నికల వల్ల ఆర్థికంగా దేశానికి లాభమే కాకుండా.. సమయం కూడా కలిసొస్తుందని, దేశం మరింత ముందుకు వెళుతుందని మోదీ ఎన్నో సమావేశాల్లో చెప్పారు.


ఈ రోజు జరిగిన రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని మళ్లీ ప్రస్తావించారు. జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలపై ఎలాంటి చర్చా అవసరం లేదని, దేశానికి ఈ ఎన్నికలు అత్యంత ఆవశ్యకమని నొక్కి చెప్పారు. అసెంబ్లీ, స్థానిక సంస్థలు, లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం వేర్వేరు ఓటరు జాబితాలను రూపొందిస్తోందని, అలా రూపొందించడం అంటే వనరులను వృథా చేయడమే అని ఆయన అభిప్రాయపడ్డారు.


80వ ‘ఆలిండియా ప్రిసైడింగ్స్ ఆఫీసర్స్’ జాతీయ సదస్సును ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.. ఆ ప్రసంగంలో భాగంగా ‘‘జమిలి ఎన్నికలపై చర్చ అనవసరం. దేశానికి అవి అత్యంత ఆవశ్యకం. కొన్ని నెలల వ్యత్యాసాల్లోనే దేశంలో ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటున్నాయి. దీంతో అభివృద్ధి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ విషయం ప్రజానీకానికి అర్థమవుతూనే ఉంది. సమస్యను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రిసైడింగ్ అధికారులు తగిన మార్గదర్శనం చేయాల్సిన ఆవశ్యకం ఉంది.’’ అని మోదీ పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై ప్రధాని మళ్లీ నోరు విప్పడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: