ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు కాంగ్రెస్ తరపున ప్రచారం చేసి నానా రచ్చ చేసిన బండ్ల గణేశ్ ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి బండ్ల గణేశ్‌ తనంతతాను కాకుండా నెటిజన్ల వల్ల వార్తల్లో కెక్కాడు. తనను వదిలేయమని నెటిజన్లను వేడుకుంటూ ఆయన పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్
మీడియాలో వైరల్ అవుతోంది.


అప్పట్లో కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొన్న బండ్ల గణేశ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన ఓ విచిత్రమైన ఛాలెంజ్ వైరల్ అయింది. కాంగ్రెస్ గెలవకపోతే తాను బ్లేడ్‌తో గొంతు కోసుకుంటానంటూ భారీ శపథమే చేశాడు. అయితే తరువాత ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. దాంతో సోషల్ మీడియాలో బండ్లపై భారీగా ట్రోలింగ్ నడించింది. బ్లేడ్ గణేశ్ అంటూ నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. ఆ ట్రోలింగ్ తట్టుకోలేక బండ్ల గణేశ్ కొన్నాళ్లపాటు మీడియా, సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. కానీ ఈ ఏడాది మొదట్లో విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ఆ చిత్ర ఫంక్షన్‌లోనే తాను ఇక ఏ పార్టీతో ఉండనని, రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని, ఇక తనను బ్లేడ్ గణేశ్ అని పిలవద్దని వేడుకున్నాడు. ''ఇక రాజకీయాలకు దూరం అవుతున్నాను.. నా పనేదో నేను చూసుకుంటున్నాను. మళ్లీ సినిమాలు నిర్మిస్తాను..'' అని క్లారిటీ ఇచ్చారు. తనను టార్గెట్‌ చేస్తూ వస్తున్న కామెంట్స్‌ని ఉద్దేశించి.. ''నాకు ఏ రాజకీయ పార్టీతో, అలాగే ఏ రాజకీయాలతో సంబందం లేదు. నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా.. దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయవద్దు.. ఇది నా అభ్యర్థన..'' అని బండ్ల గణేష్‌ ట్విట్టర్‌ ద్వారా వివరణ ఇచ్చారు. దాంతో కొంత ట్రోలింగ్ ఆగింది. అయితే ఇప్పుడు మళ్లీ నెటిజన్లు రెచ్చిపోతున్నారు.


ప్రస్తుతం హైదరాబాద్‌ అంతా ఎన్నికల వేడి రంజుకుంది. ఈ తరుణంలో.. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున జోరుగా చర్చా కార్యక్రమాలు జరిపిన బండ్ల గణేష్‌ని నెటిజన్లు మళ్లీ టార్గెట్‌ చేస్తున్నారు. గతంలో బ్లేడ్‌ విషయంలో కూడా ఇలాంటి మాటలే చెప్పి.. మాట మీద నిలబడలేదు అని చెబుతూ.. బండ్లపై గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు. దీంతో మరోసారి.. ఆయన ట్విటర్ వేదికగా నెటిజన్లను వేడుకున్నారు. 'నేను ఏ రాజకీయ పార్టీలో లేను మహాప్రభో..' అనేలా ట్వీట్‌ చేసి రెండు చేతులూ జోడించి దణ్ణం పెట్టేశారు. ''నాకు ఏరాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు నేను రాజకీయాలకు దూరం.." అని చెప్పేలా.. రెండు చేతులూ జోడించి దణ్ణం పెడుతున్న ఎమోజీని బండ్ల షేర్‌ చేశారు. మరి ఇప్పటికైనా ఆయనపై వస్తున్న వార్తలకు, కౌంటర్లకు బ్రేక్‌ పడుతుందా..? బండ్ల ట్వీట్ నెటిజన్లకు స్వాంతన కల్పిస్తుందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: