గ్రేటర్ ఎన్నికల ప్రచారంతో నగరంలో యుద్ధ వాతావరణం నెలకొంది. 100స్థానాల్లో గెలుస్తామని టీఆర్ఎస్ చెబుతుండగా, కారు స్పీడుకు ఎలాగైనా బ్రేకులు వేయాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం కూడా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచార వేగాన్ని పెంచారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అభ్యర్థుల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలు. వీరిమధ్యే పోటీ ఎక్కువగా ఉంది.

ఎంఐఎం కూడా భారీ పోటీనే ఇస్తోంది. కాంగ్రెస్, టీడీపీ తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఐదు డివిజన్లు గెలుచుకుంది. మరో డివిజన్‌లో ఎంఐఎం గెలిచింది. ఈసారి కూడా తమ స్థానాలను పదిలపరుచుకోవడానికి ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో అధికార పార్టీ టీఆర్ఎస్ కీలక నేతలను ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. సీఎం కేసీఆర్ కూతరు కవితను గాంధీనగర్ ఇన్‌చార్జిగా నియమించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను అడిక్‌మెట్ ఇన్‌చార్జిగా, రాంనగర్‌ ఇన్‌చార్జిగా మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని, అలంపూర్ ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్‌ను ముషీరాబాద్ ఇన్‌చార్జిగా, కవాడిగూడ ఇన్‌చార్జిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని, భోలక్‌పూర్‌ ఇన్‌చార్జిగా టీఆర్‌ఎస్‌కేవీ అధ్యక్షుడు జి. రాంబాబు యాదవ్‌ను నియమించారు.

టీఆర్ఎస్ కీలకనేతలు రంగంలోకి దిగడంతో ఈ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. కనీసం సగం సీట్లనైనా గెలవాలని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ భావిస్తున్నారు.

గాంధీనగర్‌ డివిజన్‌ నుంచి టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ మరదలు, ప్రస్తుత కార్పొరేటర్‌ ముఠా పద్మానరేష్‌ పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా బీజేవైఎం గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు ఎ.వినయ్‌కుమార్‌ సతీమణి ఎ.పావని పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున గుర్రం చంద్రకళ బరిలోకి దిగారు. కల్వకుంట్ల కవిత గాంధీనగర్‌ ఇన్‌చార్జిగా రావడంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.

అడిక్‌మెట్‌ డివిజన్‌ (జనరల్‌ మహిళ) నుంచి మాజీ కార్పొరేటర్‌ బి. జయరాంరెడ్డి సతీమణి ప్రస్తుత కార్పొరేటర్‌ బి.హేమలత జయరాంరెడ్డి, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచిన మాజీ కార్పొరేటర్‌ సి.సునీతాప్రకాష్‌గౌడ్‌ ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ తరఫున జంబిక కవిత, టీడీపీ అభ్యర్థిగా ఎం.చిత్ర, స్వతంత్ర అభ్యర్థిగా శ్యామ ఫుడ్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ఎలిగేటి శ్యామలతోపాటు మరికొందరు పోటీ పడుతున్నారు.

రాంనగర్‌ డివిజన్‌ జనరల్‌ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ తరపున వి. శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి కె.రవిచారి, కాంగ్రెస్‌ నుంచి లోకేష్‌యాదవ్‌, టీడీపీ అభ్యర్థిగా మాజీ కార్పొరేటర్‌ పలుస బాల్‌రాజ్‌గౌడ్‌, సీపీఎం అభ్యర్థిగా ఎం.దశరథ్‌, టీజేఎస్‌ నుంచి జశ్వంత్‌లు పోటీ పడుతున్నారు.

ముషీరాబాద్‌ డివిజన్‌ బీసీ జనరల్‌ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎడ్ల భాగ్యలక్ష్మి హరిబాబుయాదవ్‌, బీజేపీ నుంచి సుప్రియాగౌడ్‌, కాంగ్రెస్‌ నుంచి స్వప్నగౌడ్‌లు బరిలోకి దిగారు.

కవాడిగూడ డివిజన్‌ ఎస్సీ మహిళ రిజర్వుడు వార్డుకు టీఆర్‌ఎస్‌ నుంచి జి.లాస్యనందిత, బీజేపీ నుంచి జి.రచనశ్రీ, కాంగ్రెస్‌ నుంచి ఎన్‌.కవితా మహేష్‌, టీడీపీ తరపున జి.శోభారాణి, టీజేఎస్‌ అభ్యర్థిగా దివ్యవల్లి పోటీ పడుతున్నారు.

భోలక్‌ఫూర్‌ డివిజన్‌ జనరల్‌ బీసీ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బింగి నవీన్‌, ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా మహ్మద్‌ గౌస్‌, బీజేపీ అభ్యర్థిగా ఆర్‌.విశ్వం, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా వాజీద్‌ హుస్సేన్‌, టీడీపీ అభ్యర్థిగా జహీరుద్దీన్‌ సమర్‌లు పోటీపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: