అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. జో బైడెన్‌కు అధికార బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.. ఇక అందులో భాగంగానే శ్వేతసౌధం (White House) సంప్రదాయాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. వైట్ ‌హౌస్‌లో సంప్రదాయం ప్రకారం నిర్వహించే ‘థ్యాంక్స్‌ గివింగ్‌ డే’లో డోనాల్డ్ ట్రంప్, మెలానియా దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు ‘ది నేషనల్‌ థ్యాంక్స్‌ గివింగ్‌ టర్కీ’ వేడుక జరిగింది. శ్వేతసౌధంలోని రోజ్‌గార్డెన్‌లో జరిగిన ఆ కార్యక్రమంలో ట్రంప్ తనదైన శైలిలో జోకులు వేస్తూ ఉత్సాహంగా గడిపారు. అధికారం నుంచి దిగిపోయే అమెరికా అధ్యక్షులకు టర్కీ నుంచి కోళ్లను బహుమతిగా పంపిస్తారు. అధ్యక్షుడు వాటిని కోసుకొని తినడమో, లేదా క్షమించి వదిలేయడమో చేస్తారు. ఇది వైట్ హౌస్‌లో ఆనవాయితీగా వస్తున్న పద్ధతి. అయితే.. ట్రంప్ ఈ సందర్భంగా ‘కార్న్‌ (Corn)’ అలాగే దీంతో పాటు ‘కోబ్‌’ (Cob) అనే టర్కీ కోళ్ళను కూడా క్షమించి వదిలేశారు. అనంతరం రుచికరమైన వంటకాలతో విందు కొనసాగింది.


 

టర్కీ కోళ్ళకు, అమెరికా ప్రెసిడెంట్ లకు సంబంధించి పెద్ద చరిత్ర ఉంది. ప్రతి ఏటా Thanks Giving Day కు ముందు అధ్యక్షుడికి ‘ది నేషనల్‌ టర్కీ ఫెడరేషన్’ రెండు భారీ టర్కీ కోళ్లను బహూకరిస్తుంది. టర్కీ కోళ్లకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, అగ్రరాజ్యం.. అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే కోళ్లంటే మాటలు కాదు కదా! అందుకే ఈ కోళ్లను ఎంపిక చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దేశవ్యాప్తంగా సుమారు 100 వరకు కోళ్లను ఎంపిక చేసి.. వాటిని వివిధ దశల్లో జల్లెడ పడతారు. వాటిలో ఉత్తమమైన రెండు కోళ్లను ఎంపిక చేసి అమెరికా అధ్యక్షుడికి బహుమతిగా పంపిస్తారు.



1863లో అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ కుటుంబానికి విందు కోసం టర్కీ నుంచి కొంత మంది కోడిని గిఫ్ట్‌ గా పంపించారు. అయితే.. అంతకు ముందు ఏడాదే అబ్రహం లింకన్‌ కుమారులైన టెడ్‌, విలియంకు టైఫాయిడ్‌ సోకగా విలియం మరణించాడు. నాడు ప్రాణాలతో బయటపడ్డ టెడ్‌కు ఆ టర్కీ కోడి నచ్చింది. దాన్ని చంపవద్దని తండ్రి లింకన్‌ను కోరాడు. ఆ కోడికి ‘జాక్‌’ అని పేరుపెట్టి పెంచుకున్నాడు. అమెరికా అధ్యక్షుడికి గిఫ్ట్‌ గా వచ్చిన జీవిని పెంచుకున్న తొలి ఘటన ఇదే.



1989లో అధికారికంగా జార్జి హెచ్‌ డబ్ల్యూ బుష్‌ అధక్ష్య క్షమాభిక్ష అనే పదాన్ని వాడి బహుమతిగా వచ్చిన టర్కీ కోడిని జీవించేందుకు వదిలేశారు. నాటి నుంచి వైట్ హౌస్‌లో ఇది సంప్రదాయంగా కొనసాగుతోంది. జార్జి డబ్ల్యూ బుష్‌కు ముందు అధ్యక్షులందరూ ఇలా బహుమతిగా వచ్చే టర్కీ కోళ్లను విందులో వినియోగించే వారు. జాన్‌ ఎఫ్‌ కెనడీ, రిచర్డ్‌ నిక్సన్‌, జిమ్మీ కార్టర్‌ తదితరులు మాత్రం వీటిని తినకుండా వదిలేశారు. కొంత మంది అధ్యక్షులు అసలు వాటిని స్వీకరించనేలేదు. ఇక ప్రస్తుతం.. ట్రంప్ క్షమించి వదిలేసిన టర్కీ కోళ్లు కార్న్‌, కోబ్‌లను‌ ఐయోవా యూనివర్సిటీకి ఇచ్చారు. ఇక ఈ రెండు కోళ్ళు అక్కడే తమ శేష జీవితాన్ని గడపనున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: