కిషన్ రెడ్డి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి. చాలా కీలకమైన బాధ్యతలను ఆయన నిర్వహిస్తున్నారు. ఆయనది తెలంగాణా బీజేపీ రాజకీయాల్లో దశాబ్దాల‌ అనుభవం. ఆయన ఉమ్మడి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. విద్యార్ధి నాయకుడిగా యువమోర్చా నేతగా చూస్తే కనుక  కిషన్  రెడ్డి రాజకీయ ప్రస్థానం సుదీర్ఘమైనది.

అటువంటి కిషన్  రెడ్డి గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లొ సికింద్రాబాద్ లోక్ సభ నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇపుడు ఆయన పరిధిలోనే గ్రేటర్ ఎన్నికల నగరా మోగింది. కిషన్ రెడ్డి  ఇజ్జత్ కి ఇపుడు అసలైన సవాల్ కూడా వచ్చి పడింది. కిషన్ రెడ్డి తన శక్తియుక్తులు అన్నీ కూడా ఉపయోగించి పోరాడుతున్నారు.

ఆయన కేంద్రం తెలంగాణకు, ప్రత్యేకించి హైదరాబాద్ కి ఏం చేసిందన్నది కూడా వివరిస్తున్నారు. ఆయన పంచ్ డైలాగులు పేల్చడం లేదు. ఉన్నది ఉన్నట్లుగా వివరిస్తున్నారు. రాష్ట్ర పన్నులు, కేంద్ర పన్నులు అని విడగొట్టి టీయారెస్ చెప్పడం మంచి విధానం కాదని కూడా అంటున్నారు. అంతా ప్రజల సొమ్ము అని గుర్తించాలని కూడా సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే కిషన్  రెడ్డి తన లోక్ సభ పరిధిలో గణనీయమైన్ సీట్లు గెలిచి తన బలాన్ని ఇపుడు చూపించాల్సిన తరుణం ఆసన్నమైంది. గతంలో ఏం అయినా జరగవచ్చు కానీ ఇపుడు బీజేపీ బలం పెరిగింది అని జాతీయ నాయకత్వం నమ్ముతోంది. ఓట్లూ సీట్లు రాకపోతే అది లోకల్ లీడర్ల అసమ‌ర్ధతేనని కూడా అగ్ర నాయకత్వం ఫెయిల్యూర్స్ ని వారి ఖాతాలో వేసేందుకు రెడీగా ఉంది.

మొత్తానికి సుదీర్ఘ కాలం చేసిన రాజకీయ పోరాటానికి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఇపుడు కేంద్ర పెద్దల వద్ద తన పరువు పలుకుబడి పెంచుకోవాలంటే కనీసం సికింద్రాబాద్ ప్రాంతంలో కచ్చితంగా ఎక్కువ సీట్లు బీజేపీకి తేవాల్సిన బాధ్యత అయితే ఉంది. మరి కిషన్ రెడ్డి ఈ సవాల్ ని ఎలా స్వీకరిస్తారో, ఎలా జనం మన్ననలు పొంది సీట్లు తెస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: