గాంధీనగర్ డివిజన్‌ ఇన్‌చార్జిగా కల్వకుంట్ల కవితను టీఆర్ఎస్ అధిష్టానం నియమించింది. ఆమె గురువారం పార్టీ అభ్యర్థి అయిన ముఠా పద్మనరేశ్ తరపున ప్రచారం చేశారు. కల్వకుంట్ల కవితకు డివిజన్‌లో చేపట్టిన పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున మంగళ హారతులు పట్టారు. విజయతిలకాలు దిద్దారు. జై తెలంగాణ నినాదాలతో గాంధీనగర్ డివిజన్ మారుమోగింది.

గురువారం డివిజన్‌లోని అరుంధతీ నగర్, సబర్మతీ నగర్, హుస్సేన్ సాగర్  నాలా పరీవాహక ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి ముఠా పద్మనరేశ్‌ను గెలిపించాలని కల్వకుంట్ల కవిత ప్రజలను కోరారు. అభ్యర్థి ముఠా పద్మనరేశ్‌తో కలిసి నిర్వహించిన ఈ ప్రచారంలో పెద్దసంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ముఠా నరేశ్, ముఠా జైసింహ, ఎర్రం శ్రీనివాస్ గుప్త, పోతుల శ్రీకాంత్, గుండు జగదీశ్, పీఎస్ శ్రీనివాస్, మారిశెట్టి నర్సింగ్ రావు, భాస్కర్, రాకేశ్ కుమార్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌ అభివృద్ధి కోరుకునే వారందరూ బీజేపీకి ఓట్లు వేసి మేయర్ స్థానాన్ని బీజేపీకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ భవిష్యత్ కోసం బీజేపీనే గెలిపించాలన్నారు. అడిక్‌మెట్ డివిజన్ బీజేపీ అభ్యర్థి, మాజీ కార్పొరేటర్ సి.సునీతా ప్రకాష్ గౌడ్‌కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. గురువారం అడిక్‌మెట్ డివిజన్ అభ్యర్థి సునీతా ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్‌లో జరిగిన రోడ్‌షోలో కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీమోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు.

కేసీఆర్ కుటుంబ పాలనకు గ్రేటర్‌లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని అన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని అన్నారు. ప్రజలకు ఎల్లవేలలా అందుబాటులో ఉండే సునీతా ప్రకాష్ గౌడ్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉందన్నారు. మేయర్ స్థానం కైవసం చేసుకుంటామని డా.కె.లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రకాష్ గౌడ్, సదానంద్, రమేష్‌రాం, తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: