న్యూఢిల్లీ : సరిహద్దుల వద్ద పాకిస్తాన్ మళ్లీ కాల్పులకు తెగబడింది. భారత సైన్యంలోని ఓ సుబేదార్‌ను పొట్టనపెట్టుకుంది. ఎటువంటి హెచ్చరికలూ లేకుండా గురువారం పూంచ్ సెక్టార్లో అర్థరాత్రి వేళ పాకిస్తాన్ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఒకరు అమరుడయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను భారత భద్రతాదళాల ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.


రాత్రి 1.30 గంటల సమయంలో జమ్మూలోని పూంఛ్ సెక్టర్‌లో ఎల్‌ఓసీ సమీపంలో పాకిస్థాన్ దళాలు ఎటువంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపాయని తెలిపారు. ఒక్కసారిగా కాల్పులు జరగడంతో తాము అప్రమత్తమయ్యామని, శత్రు సైనికులను తిప్పికొట్టేందుకు సైన్యం దీటుగా జవాబిచ్చిందని వివరించారు.


 ఈ సంఘటనలో సుబేదార్ స్వతంత్ర సింగ్ తీవ్రంగా గాయపడ్డారని, వెంటనే అతడిని
ఉదంపూర్‌లోని సైనిక ఆసుపత్రికి తరలించామని, అయితే చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారని భద్రతాధికారి తెలిపారు.


ఇండియన్ ఆర్మీ సుబేదార్ స్వతంత్ర సింగ్ అత్యంత ధైర్యసాహసాలు, కర్తవ్య నిబద్ధతగల సైనికుడని, అతడి కోల్పోవడం బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయతే మాతృభూమి కోసం ప్రాణ త్యాగం చేసిన ఆయనకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు.
 

 సుబేదార్ స్వతంత్ర సింగ్ ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్వాల్ జిల్లా, ఒడియారి గ్రామం ఆయన పుట్టిన ఊరని, ఆయన భౌతికకాయాన్ని కుటుంబానికి అప్పగించేందుకు అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు.


ఇదిలా ఉంటే పాకిస్తాణ్ ఇటీవల అనేకసార్లు భారత సైన్యంపై కాల్పులకు తెగబడింది. 4 రోజుల క్రితం ఇదే పూంచ్ సెక్టర్‌లో డేగ్వార్, మాల్టి, డల్లాన్ ప్రాంతాల్లో అనేకసార్లు కాల్పులు జరిపింది. అంతకు ముందు కూడా సైన్యంపై కాల్పులకు తెగబడింది. అయితే పాక్ నిబంధనలను ఉల్లంఘించిన ప్రతిసారీ భారత్ దీటుగా జవాబిస్తోంది.


 ఇటీవల పాక్‌కు చెందిన ఓ సైనిక బంకర్‌కు కూడా భారత భద్రతా దళాలు మిస్సైల్‌తో పేల్చేశాయి. మరి ఈ సారి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: