నిన్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం పూర్తి అయ్యాక హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉన్న తాజ్ బంజారాలో చేంజ్ హైదరాబాద్ కార్యక్రమానికి జేపీ నడ్డా సమావేశం అయ్యారు.  మేధావులు, ప్రముఖులతో జేపీ నడ్డా సమావేశం అయ్యారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కరోనాను ఎదుర్కోవడంలో మోడీ  ముందున్నారని ఆయన అన్నారు. ఇక్కడ కేసీఆర్  ఇంటి నుంచి బయటకు రాడని ఆయన విమర్శించారు. ఐదేళ్లుగా ముఖ్యమంత్రి సచివాలయం రాలేదు.. ఇప్పుడు సచివాలయంనే కూల్చేసారని, వాస్తుకు భయపడే వారు .. ప్రజాసేవ ఏం చేస్తారు ? అని నడ్డా ప్రశ్నించారు.

నాయకుడు రాజుగా ఫీల్  కావద్దు..సేవకుడిగా ఉండాలని ఆయన అన్నారు. మోడీ తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో ఇచ్చారు.. డబ్బులు ఇస్తే కేసీఆర్ అవినీతి చేస్తాడని ఆయన ఆరోపించారు. గ్రేటర్ లో అధికారంలోకి వస్తే ఉచిత ప్రయాణం.. ఫ్రీ వైఫై ఇస్తామని అన్నారు. ప్రజాధనం సరైన రీతిలో వినియోగించాలంటే బీజేపీ తోనే సాధ్యం అని అన్నారు. కాంగ్రెస్ మోడీ మీద ఉన్న వ్యతిరేకతతో దేశాన్ని కూడా వ్యతిరేకిస్తుందని అన్నారు. రాజ్యాంగ దినోత్సవంని దేశానికి బ్లాక్ డే అని రాహుల్ అంటున్నారని అన్నారు. మీ నానమ్మ ఎమర్జెన్సీ పెట్టిన రోజులు.. పేపర్లు బంద్ చేయించారు..  మీరు చేసిన పనులు మరిచి బ్లాక్ డే అంటున్నారా ? అని ప్రశ్నించారు.

కేసీఆర్ దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలను ఏకం చేస్తా అంటున్నారని, దేశంలో మిగతా పార్టీలందరిదీ ఒకే లక్ష్యం అవినీతి పెంచడం.. కుటుంబాలను బాగు చేసుకోవడం అని నడ్డా విమర్శించారు. బీజేపీ మాత్రమే ప్రజల పార్టీ అన్న ఆయన పార్టీలో సాధారణ వ్యక్తులు కూడా ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. కేసీఆర్ బీజేపీ వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఏకం చేస్తా అంటున్నారని, ఫ్యామిలీ పార్టీ లతో కలిసి పెద్ద కుటుంబ పార్టీ చేస్తా అని చెబితే బాగుంటుందని అన్నారు. ఈ పార్టీలన్ని కలిస్తే మాకు వచ్చే ఇబ్బంది ఏమి లేదని అన్నారు. ప్రజాసేవ చేసే ఏకైక పార్టీ బీజేపీనేనని బీజేపీకి అవకాశం ఇవ్వండని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: