గ్రేటర్ ఎన్నికల్లో పార్టీలన్నీ పెద్ద పెద్ద హామీలు గుప్పిస్తున్నాయి కానీ, వాటి అమలు తీరుపై ఏమాత్రం దృష్టిపెట్టినట్టు కనిపించడంలేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి వచ్చే ఆదాయం ఎంత? ఆ ఆదాయంతో వారు ఎన్ని హామీలను తీర్చగలరు అనే అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే..

టీఆర్ఎస్ హామీలను ఓసారి చూస్తే..
నాలాల అభివృద్ధికి రూ.13 వేల కోట్లు, సమగ్ర వరదనీటి కాలువల కోసం రూ.12 వేల కోట్లు, మూసీ అభివృద్ధికి రూ.5 వేల కోట్లు వెచ్చిస్తామని ఆ పార్టీ తెలిపింది. మెట్రో, బీఆర్‌టీఎస్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల హామీ అమలుకు కనీసం రూ.20 వేల కోట్లు అవసరం అవుతాయి. సొంత స్థలాలున్న పేదవారు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేయాలంటే.. రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయి. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం అదనపు భారం.

ఇక బీజేపీ హామీలు చూస్తే..
బీజేపీ హామీల అమలుకోసం కనీసం రూ.40 వేల కోట్లు అవసరమని ఆ పార్టీ అంతర్గతంగా అంచనా వేసింది. ఉచిత కరోనా పరీక్షలు, వ్యాక్సిన్‌ కోసం రూ.300 కోట్లు ఖర్చు చేస్తామని మేనిఫెస్టోలో వెల్లడించింది. వరదల వల్ల నష్టపోయిన వారికి రూ.25 వేల చొప్పున రూ.1600 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామంది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ సౌకర్యాలు, విద్యార్థులకు ట్యాబ్‌ లకు రూ.1700 కోట్లు వెచ్చిస్తామని తెలిపింది.

కాంగ్రెస్ హామీల విషయానికొస్తే..
కాంగ్రెస్‌ హామీల్లో వరద బాధిత కుటుంబాలకు సాయం కింద రూ.3250 కోట్లు కావాలి. నాలాల విస్తరణ, గోడల నిర్మాణం, భూగర్భ నిల్వ కేంద్రాల ఏర్పాటుకు రూ.10 వేల కోట్ల వరకు అవసరం. మహిళలు, వృద్ధులు, స్టూడెంట్స్ కు.. బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్‌ లో ఉచిత ప్రయాణ హామీ ఇచ్చింది. మెట్రోరైలు సేవల విస్తరణ హామీకి కనీసం రూ.15 వేల కోట్లు అవసరమని భావిస్తున్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణానికి రూ.8 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. మొత్తమ్మీద కాంగ్రెస్ హామీలే గ్రేటర్ ప్రచారంలో అత్యంత కాస్ట్ లీ గా మారాయి.

అసలు గ్రేటర్ బడ్జెట్ ఎంత..?
జీహెచ్‌ఎంసీ బడ్జెట్ రూ.5600 కోట్ల మేర ఉంటుంది.  ప్రతి ఏటా ఈ నిధులు కూడా సరిపోక పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగడంలేదు. ఈ దశలో పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఇంతకు 10, 20 రెట్లు అదనపు నిధులు అవసరం. మరి గ్రేటర్ బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని పార్టీలు హామీలిచ్చాయా లేక... కేవలం ఓట్లకోసమే హామీలు గుప్పించారా అనే విషయాన్ని ప్రజలే తేల్చుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: