గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం దాదాపుగా చివరకు చేరుకుంది. పది రోజులుగా ఒకటే హడావుడి చేసిన నేతలు మరికొద్ది గంటల్లో సైలెంట్ కానున్నారు. డిసెంబర్ 1న గ్రేటర్ హైదారాబాద్ ఎన్నికలు జరగనున్నాయి.  ఈసారి ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని అంతా అంటున్నారు.

టీయారెస్ అనుకుంటున్నట్లుగా క్యాట్ వాక్ మాత్రం కానే కాదు. గతంలో గెలిచిన 99 సీట్లకు ఒక సీటు కలుపుకుని సెంచరీ కొడతామంటూ గర్జించి మరీ బరిలోకి దూకిన గులాబీ పార్టీకి ఇపుడు సగానికి సగం సీట్లలో గడ్డు పరిస్థితి ఉందని నివేదికలు అందుతున్నాయట. గతంలో సెటిలర్స్ అంతా గంపగుత్తగా టీయారెస్ కి ఓటు చేశారు. కానీ ఇపుడు వారిలో మార్పు కనిపిస్తోంది. సెటిలర్స్ 30 లక్షల మంది దాకా ఉంటే యాభై సీట్లలో వారి ప్రభావం ఉంటుంది.  అదే టీయారెస్ ని భయ‌పెడుతోంది.

ఇంకో వైపు చూస్తే వరదల ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. కొద్ది నెలల క్రితం వచ్చిన వరదలు భాగ్యనగరాన్ని ముంచేశాయి. ఆ చేదు కళ్ళ ముందు ఉండగానే ఎన్నికలు రావడంతో ఆ ఆగ్రహం కాస్తా అధికార పార్టీ మీదనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

ఇక దీనికి తోడు ఆరున్నరేళ్ళ టీయారెస్ పాలన మీద కచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది. అది కూడా ఇబ్బంది పెట్టే అంశమే. కుటుంబ పాలన అవినీతి, అక్రమాలు అంటూ బీజేపీ సంధించిన అస్త్రాలు జనాల్లో ఆలోచనలు రేకెత్తించేవే. ఇవన్నీ కలసి గతంలో వచ్చిన సీట్లను తగ్గించేస్తాయన్న భయం మాత్రం టీయారెస్ లో ఉంది. అయితే మేయర్ పీఠం మాత్రం టీయారెస్ కి దక్కుతుంది అంటున్నారు. ఎందుకంటే ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు ఉంది. అలాగే ఆ టైంకి మజ్లీస్ కూడా టీయారెస్ కి అండగా నిలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే గతంలో వచ్చిన 99 సీట్లకు ఒక్క సీటు తగ్గినా బీజేపీ చేసే రచ్చ మామూలుగా ఉండదుగా.

మరింత సమాచారం తెలుసుకోండి: