గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి రేపటితో తెరపడనున్నది. దీంతో అన్ని పార్టీల నాయకులు ప్రచార వేగాన్ని మరింత పెంచారు. డిసెంబర్ 1న ఎన్నికలు కావడంతో.. ఈ మిగిలిన సమయాన్ని పూర్తిస్థాయిలో వినియోగించు కోవాలని అన్ని పార్టీల వారు అనుకుంటున్నారు. ఇప్పటికే పలు రోడ్ షోలు, కుల సంఘాలు, వ్యాపార, వాణిజ్య వర్గాలతో సమావేశాలు నిర్వహించారు. ఇంతకుముందెన్నడు లేని విధంగా ఈసారి గ్రేటర్ పోరు భీకర యుద్ధ పోరును తలపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో విమర్శలు, ప్రతి విమర్శలు తారస్థాయికి చేరుకున్నాయి.

తమకు బాధ్యతలు అప్పగించిన చోట టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గాంధీనగర్ డివిజన్ ఎన్నికల ఇన్‌చార్జి కల్వకుంట్ల కవిత పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత రాజకీయాలు చేయడం కాకుండా, బీజేపీ చేసిన అభివృద్ధి గురించి ఐదు నిమిషాలు మాట్లాడండి అని ఆమె సవాల్ విసిరారు. గత ఆరేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, బురదజల్లే పనినే పెట్టుకున్నాయని ప్రతిపక్ష పార్టీలపై తీవ్రంగా మండిపడ్డారు.

కరోనా వచ్చినా, వరదలు వచ్చినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటా సహాయం చేయలేదన్నారు. ప్రతిక్షణం ప్రజల కోసమే ఆలోచించే నాయకుడు ఎవరు అంటే ఆయన సీఎం కేసీఆరే అని అన్నారు. తెలంగాణ ప్రజల పక్షాణ నిలిచేది టీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. కేంద్రంలోని బీజీపీ హయాంలో రూపాయి విలువ దారుణంగా పడిపోయిందన్నారు. విదేశీ సంబంధాలు పూర్తిగా సన్నగిల్లాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఓట్లు అడగడానికి వచ్చిన బీజీపీ నాయకులను మీరు చేసిన అభివృ‌ద్ధి ఏమిటో చెప్పాలని వారిని ప్రశ్నించండని ఆమె ప్రజలను కోరారు.

గత ఆరేళ్లలో డివిజన్ పరిధిలో అనేక సమస్యలు పరిష్కరించామని, అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ అభివృద్ధి ఇలానే కొనసాగాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మనరేశ్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువులు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: