GHMC ఎన్నికలు దగ్గర పడుతున్నాకొద్దీ తెరాస, భాజపాల మధ్య మాటలు తూటాలై పేలుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని సంఘవిద్రోహక శక్తులు నగరంలోని పలు ముఖ్యకేంద్రాలలో అలజడులు సృష్టించబోతున్నట్లు ఇంటెలిజెన్సు వర్గాల సమాచారం అందినందున నగర ప్రజలు జాగ్రత్తగాఉండాలన్నారు. ఇవి భాజపా శ్రేణులను ఉద్దేశించి చేసినవేనని కొందరు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి . 



నిన్న పఠాన్ చెరు లో జరిగిన రోడ్ షోలో బండి సంజయ్ మాట్లాడుతూ కెసిఆర్ వాఖ్యల గురించి ఇలా అన్నారు. "నగరంలో ప్రవేశించిన సంఘవిద్రోహక శక్తులు అంటే ఎవరో కెసిఆరే ఏ చెప్పాలి. అసలు అలాంటి శక్తులు నగరంలోకి ఎలా ప్రవేశించాయి? అలా జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ,పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నాయి? నగర శాంతిభద్రతలు కాపాడాల్సి న బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ కి, రాష్ట్ర డీజీపీ కి లేదా ? ఇవన్నీ నగరం లో ఉన్న ఓటర్లను అనవసర భయాందోళనకు గురి చేసే పిచ్చి ప్రయత్నమే తప్ప మరో ఉద్దేశం లేదు" అని అన్నారు.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మాత్యులు అమిత్ షా లు ghmc ఎన్నికలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజానీకానికి తెరాస చేస్తున్న అన్యాయాన్ని వివరించడానికి వస్తున్నారని తెలిసి ఆ ప్రయత్నాన్ని ఎలాగోలా ఆపాలని కెసిఆర్ ఈ చిల్లర రాజకీయాలకి తెర లేపారని మండి పడ్డారు. తెరాసకు ఈ ఎన్నికల్లో ప్రజలు గట్టి గుణపాఠమే చెప్పబోతున్నారని ఆయన అన్నారు. మొన్నటి దుబ్బాక ఎన్నికలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని, ఇక మీదట కూడా అలాంటి ఎదురుదెబ్బలు తెరాస కు తప్పవని ఎద్దేవా చేసారు. ఇది ఇలా ఉండగా డిసెంబర్ 1న జరగబోవు ఎన్నికలకు సర్వం సిద్ధం అయిందని విశ్వసనీయ సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: