ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు కూడా మిగిలిన సమయాన్ని ఉపయోగించుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన టీఆర్‌టీ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ అసోసియేషన్ డిమాండ్లను పరిష్కరిస్తామని, ఇందుకోసం అందరూ అడిక్‌మెట్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బి. హేమలత జయరాం రెడ్డికి ఓట్లు వేయాలని సభ్యులను కోరారు.

ఈ సమావేశం సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు కె.నర్సింగ్ రావు, సంతోష్, నాగేందర్, తదితరులు మంత్రి శ్రీనివాస్‌కు పలు డిమాండ్లు వివరించారు. కమ్యూనిటీ హాల్‌ను అసోసియేషన్‌కు అప్పగించాలని, దాని స్థానంలో నూతన కమ్యూనిటీ హాల్ ఆధునిక హంగులతో నిర్మించాలని, దుస్తుల షాపుల వద్ద తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు. కాలనీలో బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. దీనికి సమాధానంగా మంత్రి మాట్లాడుతూ కాలనీ వాసులందరూ ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి తమ పార్టీ అభ్యర్థి బి.హేమలత జయరాం రెడ్డిని గెలిపిస్తే ఆ తర్వాత వెంటనే మీకు ఇచ్చిన హామీలను నెరవేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బల్ల శ్రీనివాస్ రెడ్డి, నేత శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు.

తనను గెలిపిస్తే అడిక్‌మెట్ డివిజన్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని బీజేపీ అభ్యర్థి సి.సునీతా ప్రకాష్ గౌడ్ ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌టీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కె.నర్సింగ్ రావు, నాగేందర్, తదితరులు బీజేపీకి తమ కాలనీ అసోసియేషన్ మద్దతు లేఖను బీజేపీ అభ్యర్థి సునీతా ప్రకాష్ గౌడ్‌కు శుక్రవారం అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలనీలో ప్రస్తుతం ఉన్న కమ్యూనిటీహాల్ జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉందని, అందులో మీ సేవ భవనం కొనసాగుతోందని, ఆ భవనాన్ని కాలనీ అసోసియేషన్ పరిధిలోకి తీసుకువచ్చి, నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: