మంగళవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారానికి అవకాశముంటుంది. ఈసారి ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో పార్టీ అభ్యర్థుల కంటే ఎక్కువగా పార్టీల స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. మాటాల తూటాలు పేలాయి. పట్టు నిలుపుకునే దిశగా కొన్ని పార్టీలు, పూర్వ వైభవం కోసం మరి కొన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

శుక్రవారం ముషీరాబాద్ బీజేపీ క్యాంపు కార్యాలయంలో ముషీరాబాద్ మాజీ కార్పొరేటర్ అరుణ జయేందర్‌బాబు దంపతులతోపాటు టీడీపీ నాయకులు శిశు కుమార్, శంకర్ గౌడ్, నరేష్ తదితరులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రరెడ్డి, తదితరులు హాజరయ్యారు. పార్టీలోకి వచ్చిన వారికి కండువా కప్పి ఘన స్వాగతం పలికారు.

 ఈ సందర్భంగా డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో తండ్రి, కొడుకులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ఎన్నికలు వాయిదా వేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తోపాటు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు గల్లీగల్లీకి ఇన్‌చార్జిలుగా వేసి ప్రచారం చేసుకుంటే తప్పులేదు కానీ తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బీజేపీ జాతీయ నేతలు హైదరాబాద్‌లో ప్రచారానికి వస్తే ‘మీకేంటి’ అని ప్రశ్నించారు. 'టీఆర్ఎస్ నాయకులు ప్రచారం కోసం పాకిస్తాన్ నుంచి ఇమ్రాన్‌ఖాన్, దావూద్ ఇబ్రహీంలను పిలిపించుకోవాలి అని, ఎందుకంటే టీఆర్ఎస్‌కు ఎంఐఎంతో ఉన్న అనుబంధం అలాంటిది' అని ఆయన అన్నారు. ఎన్నికలను వాయిదా వేసే పనిలో తండ్రికొడుకులు ఇద్దరూ ఉన్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: