దేవాదాయ ఆస్తులను అమ్మేయాలని ప్రభుత్వం  ప్రయత్నిస్తే భక్తుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం విషయంలో మరోమారు ఇదే రుజువైంది అన్నారు. మఠానికి  చెందిన 208 ఎకరాల భూముల వేలాన్ని తాత్కాలికంగా నిలిపి వేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అందులో భాగమే అని ఆయన పేర్కొన్నారు. నిలుపుదల తాత్కాలికంగానైనా చేయడం స్వాగతించాలి అన్నారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల అమ్మకం, శ్రీవారి సొమ్మును ప్రభుత్వ బాండ్ల రూపంలో మళ్లించాలనే నిర్ణయాలు కూడా భక్తుల నుంచి వచ్చిన నిరసనల వల్లే ప్రభుత్వం వెనక్కి వెళ్ళింది అని ఆయన పేర్కొన్నారు.

పాలకులు దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు, ఇతర ఆస్తులను అమ్మేసుకొనే అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు అవసరం అన్నారు. టిటిడి ఆస్తులు అమ్మాలనుకొన్నప్పుడో, మఠం భూములు వేలం సమయంలోనో భక్తులు నిరసన తెలుపగానే నిలిపివేస్తాం అంటూ తాత్కాలిక ప్రకటనలతో సరిపెట్టడం కాదు అన్నారు.  శాశ్వత చర్యలు కావాలి అన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలి అని ఆయన డిమాండ్ చేసారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాలు, ధర్మ సత్రాలు, మఠాలకు చెందిన భూములు, ఇతర స్థిరాస్తులకు ప్రభుత్వం కేవలం ధర్మకర్తగానే వ్యవహరిస్తూ సంరక్షణ బాధ్యతకే పరిమితం చేసేలా ఆ చట్టం ఉండాలన్నారు.

సదరు ఆస్తులను అమ్ముకొనే అధికారం పాలకులకు ఉండకూడదు అని ఆయన సూచించారు. ఆస్తులను పరిరక్షించలేకపోతున్నాం అనే ప్రభుత్వ వాదనలో పస లేదు అని మండిపడ్డారు.  రెవెన్యూ, పోలీస్... ఇలా అన్ని శాఖలు ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి అన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వం దేవుడి మాన్యాలను ఎందుకు కాపాడలేకపోతోంది? అని ఆయన వ్యాఖ్యానించారు. పాలకుల జోక్యంతోనే ఆ మాన్యాలకు రక్షణ లేకుండా పోతోందా? అనే ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయని వెల్లడించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆస్తులను కాపాడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే తాత్కాలిక నిలుపుదల లాంటి ప్రకటనలకు పరిమితం కాకుండా ఆస్తులు అమ్మే వీలు లేకుండా చట్టం చేయాలని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: