వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఇంకా ప్రమాణ స్వీకారం కూడా
చేయలేదు. కానీ అప్పుడే ఆయనకు కొత్త తలనెప్పులు వచ్చిపడుతున్నాయి.
ఇరాన్‌కు చెందిన ఓ న్యూక్లియర్ సైంటిస్ట్ హత్యకు గురవ్వడంతో దృష్టంతా
బైడెన్‌పై పడింది. ఈ పరిస్థితులు అమెరికా, ఇరాన్‌ల మధ్య కొత్త
ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి.

ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే
పరిస్థితి ఉండేంది. ఇరు దేశాల అధ్యక్షులూ ఒకరిపై ఒకరు ప్రత్యక్ష, పరోక్ష దాడులు కూడా చేసుకున్నారు. బహిరంగంగా బెదిరింపులకూ దిగారు.

‘అమెరికా.. బీ కేర్‌ఫుల్..’ అంటూ ఇరాన్ హెచ్చరిస్తే.. ‘ఇరాన్‌తో యుద్ధానికైనా రెడీ’ అంటూ ట్రంప్ ప్రతి దాడికి దిగారు.
 ఈ నేపథ్యంలోనే కరోనా రావడం, అమెరికా అధ్యక్ష పీఠానికి ఎన్నికలు జరగడం, చకచకా జరిగిపోయాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడంతో ఇరాన్ కొంత ఊపిరి పీల్చుకుంది. అయితే మరో 2 నెలల పాటు అతడే అధ్యక్షుడిగా కొనసాగనున్న నేపథ్యంలో మిత్ర పక్షాలన్నీ జాగ్రత్తగా ఉండాలని ఇరాన్ రెండు రోజుల
క్రితమే హెచ్చరించింది. ఇంతలోనే తమ దేశానికి చెందిన న్యూక్లియర్ సైంటిస్ట్ హత్యకు గురవ్వడంతో ఇరాన్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది.

ఇరాన్‌కు చెందిన అణ్వాయుధ శాస్త్రవేత్త మొహిసీన్‌పై గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఉన్నట్లుండి కాల్పులు జరపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
దీనిపై ఇరాన్ ప్రభుత్వం స్పందించింది. ఈ దాడి వెనుక ఐజ్రాయెల్ ఉందంటూ ఆరోపించింది. అయితే పరోక్షంగా మాత్రం
అమెరికా అనుమతితోనే ఈ హత్య జరిగిందనే సంకేతాలూ ఇరాన్ నుంచి వస్తున్నాయి.‘ఈ హత్య చేసిన వారిపై ప్రతికారం తీసుకుంటాం. వారి మిత్రుడి(ట్రంప్ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ) అధికారం చరమాంకానికి చేరుకున్న స్థితిలో ఒత్తిడి తెచ్చేందుకు ఇరాన్ వ్యతిరేకులు ప్రయత్నిస్తున్నారు’ అని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ట్వీటర్‌లో ఘాటుగా స్పందించారు.ఈ నేపథ్యంలోనే
మొహిసీన్‌ హత్య విషయంలో ఇరాన్‌ అంతర్గత భద్రత పర్యవేక్షణ సంస్థ నేషనల్
సెక్యురిటీ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైనట్లు సమాచారం.

అణుబాంబు తయారు చేసేందుకు ఇరాన్ చేపట్టిన ఓ రహస్య ప్రాజెక్టుకు ఫక్రీజాయే
నేతృత్వం వహించారనేది పాశ్చత్య దేశాల ఆరోపణ. అయితే..2003లోనే బ్రేకులు పడ్డ ఈ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్, అమెరికాలు ఇప్పటికే పలు మార్లు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో
రాబోయే రాజుల్లో అమెరికా, ఇరాన్‌ల మధ్య కొత్త సమస్యలు వచ్చే అవకాశం
 ఉందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇరాన్‌ను దారికి తెచ్చుకోవాలనుకుంటున్న బైడెన్‌కు భవిష్యత్తులో తలనొప్పులు తప్పవని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఘటనపై వ్యాఖ్యానించేందుకు అటు ఇజ్రయెల్‌, ఇటు అమెరికా ఇరు దేశాల ప్రభుత్వాలూ నిరాకరించాయి. మరికొన్ని రోజుల్లో అధ్యక్ష పీఠం ఎక్కనున్న జో బైడెన్‌కు ఈ పరిణామం కొద్దిగా తలనొప్పిని తెచ్చిపెడుతోంది. భవిష్యత్తులో ఇరాన్‌తో లేనిపోని చిక్కులు తెచ్చి పెట్టే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమీప భవిష్యత్తులో
ఇరాన్, అమెరికాల దౌత్య సంబంధాలు మరింత దిగజారవచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: