గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు...హైదరాబాద్‌లో వరదలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సాయం చేయకపోవడం పట్ల సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో వివిధ నగరాల్లో వరదలు వచ్చినప్పుడు వారికి సాయం చేసిన ప్రధాని మోదీ హైదరాబాద్ విషయంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు నష్టం వస్తే సాయం చేయలేని వారు.. ఇప్పుడు ఓట్ల కోసం ఎగబడి మరీ వస్తున్నారని అన్నారు. ఈ బక్క కేసీఆర్‌ను కొట్టేందుకు ఇంత మంది వస్తారా? అని చమత్కరించారు.

‘‘మేం ఉపద్రవంలో ఉన్నామని ప్రధానిని అడిగా. రూ.1300 కోట్లు ఇవ్వాలని అడిగా. 13 పైసలు కూడా ఇవ్వలే. అందరికీ ఇచ్చారు కదా. మేమేం తప్పు చేశామని అడిగా. ఇదంతా మీరు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరికి కర్ర కాల్చి వాత పెట్టాలో మీకు తెలుసు. వరద వచ్చింది ఆదుకోమ్మంటే ఎవరూ వినలే. ఈ బక్క కేసీఆర్‌ను కొట్టేందుకు ఇంత మంది వస్తరా. ఇప్పుడు చెప్తున్నా. కేసీఆర్ రక్తం పౌరుషం ఉన్న వ్యక్తి.’’ అని అన్నారు.

‘‘హైదరాబాద్ నగరం నడి బొడ్డులో ఎన్నో పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి. వాటన్నింటినీ నగరం అవతలకు తరలించేలా ప్రణాళిక చేస్తున్నాం. మెట్రో రైలును ఎయిర్ పోర్టు వరకూ పొడిగిస్తాం. హైదరాబాద్‌లో కాలుష్యం తగ్గించేందుకు మొన్ననే ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని రూపొందించాం. హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీని పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. మూసీ నదిని గోదావరితో అనుసంధానం చేసి అందమైన మూసీ నదిగా మారుస్తాం. అందులో ఇకపై మురుగు నీరు ఉండే పరిస్థితి ఉండదు. హైదరాబాద్ నిర్మాణ బాధ్యత పూర్తిగానే నాదే. మీరంతా నాపై విశ్వాసం ఉంచండి.’’ ‘‘హైదరాబాద్‌లో శాంతి భద్రతలు ఎంత చక్కగా ఉన్నయో మీకందరికీ తెలుసు. సీసీటీవీ కెమెరాలు ఇంత పెద్ద సంఖ్యలో వాడుతున్న నగరం ప్రపంచంలో మరే దేశమూ లేదు. నగరాన్ని మరింత నివాసయోగ్యమైన సిటీగా మార్చుతాం. నగరంలో ప్రతి అంగుళం బాగుపడాలనే కల నాకు ఉంది.’’ అని కేసీఆర్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: