నివర్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా నష్టం చేకూరింది. ఈ నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలను చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. వరద నీటి నిల్వ కారణంగా ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన కార్యాచరణను అమలు చేయాలన్నారు. మరో రెండు రోజుల్లో ఇంకొక తుఫాను రాబోతుందన్న హెచ్చరికల నేపథ్యంలో ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు, కంట్రోల్ రూంలను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, సీడీఎంఏ విజయకుమార్, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి రాంమనోహర్ రావు, డీటీసీపీ రాముడు, ఇంజినీరింగ్ చీఫ్ చంద్రయ్య తదితర ఉన్నతాధికారులతో కలిసి విజయవాడ ఎఎంఆర్ డీఏ కార్యాలయం నుంచి మున్సిపల్ కమిషనర్లతో శనివారం మంత్రి బొత్స సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.


ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. భారీ వర్షాలతో ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువైన మంచి నీటి ట్యాంకులు, చెరువులకు గండ్లు పడకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. అలాగే రాకపోకలకు అంతరాయం కలిగించేలా రోడ్లపై పడిపోయిన చెట్లను తొలగించడంతో పాటు, పూడిపోయిన డ్రైన్లను శుభ్రం చేయాలన్నారు. పంపిణీ చేస్తున్న తాగునీరు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన క్లోరినేషన్ ప్రక్రియను చేయడంతో పాటు, ఇళ్ల వద్ద ఉన్న కుళాయిల వద్ద నాణ్యతా పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. పునరావాస కేంద్రాల్లోని వసతులపై కమిషనర్ల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకుని, ఈ కేంద్రాల్లో ఆశ్రయం కల్పించిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి బొత్స అన్నారు. తుఫాను, భారీ వర్షాల అనంతరం నీటి నిల్వల కారణంగా అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేస్తూ అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఇంకో తుఫాను వచ్చే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిథిలోని అధికారులందరూ పూర్తి అప్రమత్తతతో ఉండాలని మంత్రి సూచించారు.


అనంతరం టిడ్కో గృహ నిర్మాణంపై మంత్రి మాట్లాడుతూ.. లబ్ధిదారులకు అర్హతా పత్రాల అందజేత, బ్యాంకు రుణాల టై అప్ అంశాన్ని వేగవంతం చేయాలని, నిర్దేశిత ప్రణాళిక ప్రకారం ఇందుకు సంబంధించిన పనులన్నీ సక్రమంగా పూర్తి అయ్యేలా చూడాలన్నారు. లబ్ధిదారులకు సరైన, సక్రమమైన సమాచారాన్ని చేరవేసేందుకు, వార్డు సెక్రటరీల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. అంతేకాకుండా వార్డు సెక్రటరీలకు వారి విధుల నిర్వహణపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఉన్నత స్థాయి శిక్షణా తరగతులను నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులకు మంత్రి సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: