కేంద్ర బిజెపి పెద్దలంతా రంగంలోకి దిగి పోయి మరీ గ్రేటర్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ ప్రభావం ఎన్నికల్లో కనిపించకుండా చేసి, గ్రేటర్ మేయర్ పీఠాన్ని దక్కించుకుని తమ సత్తా చాటుకోవాలని , తెలంగాణలో అధికారం దక్కించుకునేందుకు ఈ ఎన్నికలు నాంది పలుకుతాయి అని ఆ పార్టీ రాష్ట్ర తెలంగాణ నాయకులతో పాటు, అగ్ర నాయకులు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఎక్కడ ఏ తేడా రాకుండా అన్ని రకాలుగానూ గ్రేటర్ లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్ పీఠం సంపాదించడం ద్వారా సులువుగా , తెలంగాణలో అధికారం దక్కించుకోవచ్చు అనే అభిప్రాయంలో బీజేపీ నేతలంతా ఉన్నారు.



 దుబ్బాక ఎన్నికలలో ఫలితాలు అనుకూలంగా రావడంతో బీజేపీలో పట్టుదల మరింతగా పెరిగింది. ఇప్పటికే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ , నిజామాబాద్ ఎంపీ అరవింద్,వంటి నాయకులు టిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, గ్రేటర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేకత కూడా ప్రజలలో ఎక్కువగా ఉండడంతో  ప్రజల చూపు తమ వైపు ఉండేలా చూసుకుంటూ బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉంటే గ్రేటర్ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. 



ఇప్పటికే అనేక మంది కేంద్ర మంత్రులు,  బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తేజస్వి సూర్య ఇలా చెప్పుకుంటూ వెళితే మహా మహా నాయకులు ఇప్పుడు గ్రేటర్లో ప్రచారం నిర్వహించి వెళ్లారు. ఇప్పుడు రాజకీయ ఉద్దండుడిగా పేరున్న అమిత్ షా నేరుగా గ్రేటర్  ప్రచారానికి వస్తూ ఉండడం ఉత్కంఠ కలిగిస్తోంది . ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి నేరుగా చార్మినార్ వద్దకు వెళ్లి అక్కడ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. దాదాపు 30 నిమిషాల పాటు అక్కడే ఉండబోతున్నారు.



 ఆ తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని వారసిగూడ లో అమిత్ షా రోడ్ షో నిర్వహిస్తారు. అయితే అమిత్ షా పర్యటనలో టిఆర్ఎస్ ను పూర్తిగా టార్గెట్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. పనిలో పనిగా ఎంఐఎం పార్టీ పైన అమిత్ షా సంచలన విమర్శలు చేసే అవకాశం ఉండడంతో మత ఘర్షణలు తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.





మరింత సమాచారం తెలుసుకోండి: