ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు నవంబర్ 30 అనగా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పటిష్టమైన ఏర్పాట్ల నడుమ ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు అన్ని జాగ్రత్తలను తీసుకోవాలని అధికారులకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం సూచించారు. శాసనసభ సమావేశాల నేపథ్యంలో శనివారం అసెంబ్లీలో పలు శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో, శాసన మండలి చైర్మన్‌ ఎంఏ షరీ‌ఫ్‌తో కలిసి శనివారం ఆయన సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. శాసనసభ సమావేశాల తొలిరోజే బిల్లులన్నీ సిద్ధం చేయాలని, కొవిడ్‌ దృష్ట్యా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ సమావేశాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలను టీవీల్లో ప్రజలు గమనిస్తుంటారని, దీన్ని గుర్తించి సభ్యులడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని పేర్కొన్నారు.
 



తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో ప్రస్తావిస్తారనే ఆసక్తి ప్రజల్లో ఉంటుందని, ఇటువంటి సమయంలో సభ్యులడిగే ప్రశ్నలకు సమాధానాలు, పరిష్కారాలు లభిస్తే వారు కూడా సంతృప్తి చెందుతారన్నారు. ఇకపై ప్రతి సెషన్‌ ముందు గత సెషన్‌కు సంబంధించిన ప్రశ్నలు, ఇచ్చిన జవాబులు, ఇవ్వాల్సిన జవాబులపై శాఖల వారీగా సమీక్షలు నిర్వహించడం వల్ల ఎంతో మేలు జరుతుందన్నారు. సమావేశాల్లో అడిగే ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం సభ్యుల ప్రాథమిక హక్కు అని, శాఖల వారీగా సభ్యులు అడిగే ప్రశ్నలకు తప్పనిసరిగా జవాబులు చెప్పాల్సిన బాధ్యత ఆయా శాఖాధిపతులపై ఉందని శాసనమండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ స్పష్టం చేశారు. శాసనసభ సమావేశాలు ఫలప్రదం చేయాల్సిన బాధ్యత ఎక్కువగా అధికారులపై ఉందని వ్యాఖ్యానించారు. సమావేశాల్లో జీరో అవర్‌ ఎంతో ముఖ్యమైన అంశమని గుర్తుచేశారు. వివిధ కారణాలతో గతం కంటే చట్టసభల సమావేశాల రోజుల సంఖ్య తగ్గుతూ వస్తోందని శాసన మండలి చీఫ్‌విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పిటిషన్‌ కమిటీ తరచూ సమావేశం నిర్వహించడం వల్ల సభ్యులడిగే ప్రశ్నలకు సమాధానాలు లభించే అవకాశం ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: