హైదరాబాద్‌: మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బీజేపీకి ఓటు వేయమని ప్రజలకు చెప్పారు. నమ్మడం లేదా..? కానీ ఇది నిజం. శనివారం రాత్రి పాతబస్తీలోని ఝాన్సీ బజార్‌లో ఎంఐఎం ఎన్నికల ర్యాలీ జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఒవైసీ బీజేపీకి ఓటు వేసుకోమని ప్రజలకు సూచించారు. అయితే లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి ఓటు వేసుకోవాలని, కానీ స్థానిక ఎన్నికల్లో మాత్రం ఇక్కడి పరిస్థితుల ప్రామాణికంగా ఓటు వేయాలని కోరారు. మార్వాడీలు, బెంగాలీలు, ఇతర వ్యాపార వర్గాలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేసుకోండి. కానీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వద్దు. ఇక్కడ స్థానిక అంశాలను ప్రామాణికంగా చేసుకొని మీ ఓటు వినియోగించండి. అందరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఎన్నికల సమయంలో మీ ఓటే మీ ఆయుధం. దానిని సక్రమంగా వినియోగించండి. మీరు ఇంతకాలం మాకు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక్కటి కావాల్సిన సమయం దగ్గర పడింది. మాకు ఆప్తులుగా మారండి. మనమంతా కలిసి ఈ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం’ అంటూ ఒవైసీ పిలుపునిచ్చారు.


జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారని, దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి ఒక్కొక్కరుగా ఇక్కడికి వచ్చి ఎన్నికల ప్రచారాలు చేస్తున్నారని, ఇక ఆ పార్టీ తరఫున ప్రచారానికి రావడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక్కరే మిగిలారని  ఒవైసీ ఎద్దేవా చేశారు.

అంతకు ముందు దత్తాత్రేయ నగర్‌ డివిజన్‌లో కూడా ఒవైసీ ఎన్నికల ప్రచార కార్యక్రమం జరిగింది. అక్కడ మాట్లాడిన ఆయన.. హైదరాబాద్‌ అభివృద్ధికి బీజేపీ చేసిందేమీ లేదని, వరదల వల్ల నష్టపోయిన వారికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాయం అందిస్తుంటే, చూసి ఓర్వలేని కేంద్రం ఆ సాయాన్ని కూడా నిలిపివేయించిందని ఆరోపించారు. 1980, 1990ల నాటి పరిస్థితులు మళ్లీ రానివ్వమని, తనలో ప్రాణం ఉన్నంత వరకు, దేవుడి ఆశీస్సులున్నంత వరకు హైదరాబాద్‌లో మత సామరస్యం దెబ్బతినకుండా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: