గ్రేటర్ హైదారాబాద్ ఎన్నికల్లో టీయారెస్ బీజేపీలతో పాటు మరో ప్రధానమైన పార్టీ ఉంది. అదే మజ్లీస్. పాతబస్తీ అంతటా ఆవరించి ఉన్న మజ్లీస్ గత ఎన్నికల్లోనూ గణనీయంగా సీట్లు తెచ్చుకుంది. హైదరాబాద్ కార్పొరేషన్ లో తన సత్తా చాటు కుంది. ఈసారి ఎన్నికలకు వచ్చిన మౌలికమైన తేడా ఏంటీ అంటే మజ్లీస్ పార్టీ చాలా రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి జాతీయ గుర్తింపు తెచ్చుకుంది.

ముస్లిం మైనారిటీ వర్గాలకు ఒక పార్టీగా మజ్లీస్ నిలిచింది. ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ ఫ్రంట్ లైన్ లోకి వచ్చింది ఈసారి. ఆ పార్టీ కాంగ్రెస్ ని నెట్టి మరీ తానే అసలైన ప్రధాన ప్రతిపక్షం అంటూ గర్జిస్తోంది. అదే విధంగా టీయారెస్ ని విమర్శించే క్రమంలో మజ్లీస్ ని కూడా ముందుకు లాగుతోంది.

పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని చెప్పడం కానీ, అక్కడ రోహింగ్యాలు ఉన్నారని గట్టిగా చాటింపు వేయడం కానీ బీజేపీ చేసిన యుద్ధంలో భాగాలు. వీటి వల్ల మజ్లీస్ పార్టీని దెబ్బకొట్టాలని బీజేపీ అనుకుంటోంది. అందుకే పాతబస్తీలో మొత్తం సీట్లకు బీజేపీ పోటీ పెట్టింది. అయితే బీజేపీ ఇంతలా టార్గెట్ చేయడంతో మజ్లీస్ కి కూడా ఎక్కడ లేని గుర్తింపు వస్తోంది.

పైగా ఈ మధ్య దాకా మజ్లీస్ అంటే కొంత ఇష్టం లేని ముస్లిం వర్గాలు, ఆ పార్టీ విధానాలతో విభేదించే వారు కూడా బీజేపీ ని చూసి మళ్ళీ మజ్లీస్ వైపే వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మజ్లీస్ పార్టీ మీద ఎంతో కొంత అసంతృప్తి ఉన్నా కూడా అది చివరికి బీజేపీ కారణంగా  పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తప్పనిసరిగా తమకంటూ ఉన్న ఏకైక పార్టీ మజ్లీస్ ని కాపాడుకోవాలి అన్న ఉద్దేశ్యంతో  ముస్లిం వర్గాలు గంపగుత్తగా మజ్లీస్ వైపు టర్న్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.

ఇక పాతబస్తీ లాంటి చోట్ల ముస్లిం డామినేషన్ తో పాటు కొన్ని సెగ్మంట్లలో హిందూ ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. వారిని పోలరైజ్ చేస్తూ తనకు అనుకూలంగా  చేసుకోవాలని బీజేపీ వేసిన ఎత్తులు ఎంతవరకూ పారుతాయి అన్నది కూడా చూడాలి. హిందూ ఓట్ల విషయానికి వస్తే కాంగ్రెస్, టీయారెస్ కూడా ఎంతో కొంత చీలుస్తాయి. అది చివరికి మజ్లీస్ కి మేలు చేస్తుందని అంటున్నారు. మొత్తానికి సాలిడ్ గా ఈసారి కూడా ఎక్కువ సీట్లు మజ్లీస్ గెలుచుకోవడానికి బీజేపీ దూకుడు ఉపయోగపడుతుందా అన్న చర్చ అయితే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: