లక్నో: యూపీలో లవ్ జీహాద్‌పై తొలి కేసు నమోదైంది. దేశంలోనే ఇది మొట్టమొదటి కేసు. చట్టవిరుద్ధంగా మత మార్పిడి చేయడానికి వ్యతిరేకంగా యూపీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఓ మహిళను మతం మారాలంటూ మరో వ్యక్తి ఒత్తిడి చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ సర్కార్ నవంబరు 24న చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్, 2020ను తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆనందిబెన్ పటేల్ శనివారం ఆమోదం తెలిపారు. దీంతో ఈ ఆర్డినెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే దీనిపై మొదటి కేసు కూడా ఆదివారం నమోదైంది.

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆర్డినెన్స్ ప్రకారం దేవరనియా పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి మతం మారాలంటూ అదే ప్రాంతానికి చెందిన మరో మహిళపై ఒత్తిడి తీసుకొచ్చాడు. అయితే ఆమె మతం మారేందుకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. అయితే నిందితుడు పరారీలో ఉన్నాడు.


ఇదిలా ఉంటే చట్టవిరుద్ధంగా మతం మారాలంటూ నిర్బంధించేవారికి అత్యధికంగా 10ఏళ్ల జైలు శిక్ష విధించేలా ఆర్డినెన్స్ చేయబడింది. పెళ్లి కోసం మతం మారాలంటూ నిర్బంధించేవారికి ఏడాది నుంచి 5ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.15,000 జరిమానా విధించే అవకాశం ఉంది. మైనర్లను, ఎస్సీ, ఎస్టీ మహిళలను చట్ట విరుద్ధంగా మతం మార్చేవారికి 3 సంవత్సరాల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.25,000 జరిమానా విధించేందుకు వీలుంది. యూపీ ప్రభుత్వంతో పాటు మధ్యప్రదేశ్, కర్నాటక, హర్యానాలు కూడా ఇదే తరహా చట్టాలను అమల్లోకి తీసుకురాన్నాయి.

అయితే ఈ రాష్ట్రాలకంటే ముందుగా 2018లోనే ఉత్తరాఖండ్ ప్రభుత్వం మత స్వేచ్ఛ చట్టం 2018ని అమల్లోకి తీసుకొచ్చింది. గతేడాది హిమాచల్ ప్రదేశ్ కూడా ఇలాంటి చట్టాన్నే రూపొందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: