రేపటి నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో ఏ అంశాల మీద చర్చ జరుగుతుంది ఏంటీ అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సమావేశాల్లో విపక్షాల పాత్రలపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు అన్ని మీడియా సంస్థల ప్రతినిధులను అనుమతించాలని సభాపతి కి చంద్రబాబు లేఖ రాసారు.

అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్  పునరుద్దరించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసారు. శాసనసభ శీతాకాల సమావేశాలకు మీడియాను అనుమతించకుండా, మీడియా పాయింట్ ను తీసివేస్తూ ఆదేశాలు ఇవ్వటాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అని ఆయన స్పష్టం చేసారు. ప్రజాస్వామ్యంలో ప్రధాన భాగస్వామి అయిన మీడియాను నిషేధించడం అప్రజాస్వామ్యం అని ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 2430 ద్వారా మీడియా హక్కులను హరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే శిక్షించాలని ఉత్తర్వులు ఇచ్చింది అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

ఈ జీవోను ఈ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ మీడియా కూడా తీవ్రంగా వ్యతిరేకించింది అని ఆయన వ్యాఖ్యలు చేసారు.  ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఈ జీవోను తప్పుబట్టింది అని ఆయన అన్నారు.  ఇప్పుడు చట్టసభల్లోకి మీడియాను నిషేధించడం అంతకంటే దారుణమైన చర్యగా భావిస్తున్నాము అన్నారు.  పార్లమెంటు సమావేశాలకు లేని నిషేధం ఇక్కడ ఎందుకు విధిస్తున్నారు? అని ఆయన నిలదీశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని, చట్ట సభల్లోని అంశాలను ప్రజలకు తెలియకుండా ఉండటానికి మీడియాను నిషేదించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని ఆయన వ్యాఖ్యానించారు.  సభా కార్యక్రమాలను యథాతథంగా ప్రజలకు తెలియజేసే అవకాశం ఇవ్వడమే నిజమైన ప్రజాస్వామ్యం అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: