తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల ప్రచారంలో వివిధ పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ గ్రేటర్ ఎన్నికలు ప్రధానంగా తెరాస – మజ్లిస్ లకు, బీజేపీకు మధ్య జరిగే సమరంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఇరు వర్గాల నాయకుల మధ్య మరీ ప్రధానంగా పాతబస్తీలో బీజేపీ, ఎంఐఎం నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో ఇరు పార్టీలకు చెందిన నాయకులపై పోలీస్ కేసులు సైతం నమోదు అవుతున్నాయి. అయితే తాజాగా పాతబస్తీపై మరోసారి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో హిందువులు భయానక వాతావరణంలో జీవిస్తున్నారని అన్నారు. ఇక అలాగే పాతబస్తీని భాగ్యనగరంగా మార్చాలని బీజేపీ కోరుకుంటోందని స్పష్టం చేశారు.


 

అలాగే బేగంపేటలో వైద్యులతో బండి సంజయ్‌ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... పాతబస్తీ ప్రాంతంలో హిందూ జనాభాను తగ్గించేందుకు కుట్ర జరుగుతోంది అని ఆరోపించారు. శాలిబండ, అలియాబాద్, ఉప్పుగూడ, లాల్ దర్వాజ, గౌలిపుర, తార్నాకా వంటి ప్రాంతాల్లో ఉన్న హిందువులు ఎక్కడకి పోయారు? అని ప్రశ్నించారు. వాళ్ళ ఆస్తులను ఎవరు ధ్వంసం చేశారు? వాళ్ళ ఆస్తులను ఎవరు కబ్జా చేశారు? అని నిలదీశారు. పోలీసులు హీరోలు అన్నారు. అలాగే భాగ్యనగర్‌లో పోలీసుల్ని గెలిపిస్తే.. 24 గంటల లోపే పోలీసులకు 15 నిమిషాలు స్వేచ్ఛను ఇస్తామని అన్నారు. పాకిస్థాన్ కుక్కలను, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ రోహింగ్యా లుచ్చాలను బయటకు గుంజి మరి వాళ్ళను తరిమేస్తామని అన్నారు.


భాగ్యనగరానికి బీజేపీయే రక్షణ కవచమని అన్నారు బండి సంజయ్. పాతబస్తీలో ఏడాదికి రూ.600 కోట్లు విద్యుత్‌ బిల్లులు చెల్లించడం లేదన్నారు. అలాగే ఆస్తి పన్ను చెల్లించడం లేదు, ఆఖరికి నల్లా బిల్లులు కూడా చెల్లించడం లేదు. పన్నులన్నీ హిందువులు కడితే పాతబస్తీలో మీరు జల్సా చేస్తారా?'' అని ప్రశ్నించారు బండి సంజయ్. గ్రేటర్‌ ఎన్నికలలో బీజేపీకు అవకాశం ఇవ్వాలని వైద్యులను కోరారు. దేశంలో ఎన్నో మహానగరాలను భాజపా అభివృద్ధి చేసిందని, మన ఈ హైదరాబాద్‌ను కూడా మహానగరంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: