హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరింది. దీంతో అన్ని పార్టీలు తమ అమ్ముల పొదిలోని శక్తిమంతం అయిన అస్త్రాలను ఉపయోగిస్తున్నాయి. తెల్లారితే పోలింగ్ కావడంతో పార్టీలన్నీ చివరగా తాము చేసే హామీలతో పాటు ఇతర పార్టీలపై విమర్శల విషయంలో కూడా గేర్ మార్చాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు కూడా టీఆర్‌ఎస్, బీజేపీలపై మండిప్డడారు. కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ బీజేపీపై ధ్వజమెత్తారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను టార్గెట్ చేసిన ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. బండి సంజయ్‌ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నట్లు కనబడుతున్నారని నిప్పులు చచెరిగారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం చివరి దశలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి అభ్యర్థులు దొరకడం కరువైందని, ఈ కారణంగానే కాంగ్రెస్‌ నేతలను అడ్డదారుల్లో పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇచ్చారని కాషాయ పార్టీపై మండి పడ్డారు.

కులం, మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని, వేరే ఏమీ చెప్పడానికి ఆ పార్టీ వద్ద ఇతర విషయాలేవీ లేవని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో అల్లర్లు రేపేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, ప్రజలను విడగొట్టాలని చూస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేయడానికి జాతీయ స్థాయిలో కీలక నేతలు అవసరమా? అని అడిగారు.

ఇదే హైదరాబాద్‌ భారీ వర్షాలు, వరదలు వచ్చి మునిగిపోయినప్పుడు అమిత్‌షా ఎక్కడున్నారు? అప్పుడు ఏమీ పట్టనట్లు కూర్చొని, ఇప్పుడు మాత్రం ప్రచారం చేయడానికి అమిత్‌షా ఏ మొహం పెట్టుకొని హైదరాబాద్‌ వచ్చారు? అని ప్రశ్నించారు. ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ పోటా పోటీగా పోరాడుతున్నాయి. పోటీ మొత్తం ఈ రెండు పార్టీల మధ్యే అన్నట్లు కనబడుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీని కూడా తక్కువ అంచనా వేయకూడదని, తక్కువ సీట్లే ఉన్నప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలో ఉన్న విషయం మర్చిపోకూడదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: