గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం నేడు ముగిసింది. ఎల్లుండు ఎన్నికల నిర్వహణ ఉంటుంది. ఎన్నికల ప్రచారం అంతా కూడా ఘాటుగా జరగడంతో ఎన్నికల నిర్వహణ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక కరోనా కూడా ఎన్నికల విషయంలో కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే... తెలంగాణా రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా, జిహెచ్ఎంసి ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఎన్నికల అధికారి మరియు జిహెచ్ఎంసి కమిషనర్ ఈ క్రింది కోవిడ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది అని ఎన్నికల సంఘం పేర్కొంది.

కోవిడ్-19 కు సంబంధించిన ఏర్పాట్లు మరియు ముందు జాగ్రత్త చర్యల పర్యవేక్షణ కొరకు జిహెచ్ఎంసి చీఫ్ మెడికల్ ఆఫీసరును కమిషనరేట్ స్థాయిలో, 30 సర్కిళ్ళలోని సహాయ వైద్య అధికారులను సర్కిల్ స్థాయిలో కోవిడ్ నోడల్ అధికారులుగా నియమిస్తూ, సర్కిల్ లెవల్ అధికారులను వార్డు స్థాయి కోవిడ్ అధికారులను నియమించాల్సిందిగా ఆదేశించడమైనది అని ఎన్నికల సంఘం ప్రకటించింది. లక్షా 20 వేల కిట్లను 30 సర్కిల్ కార్యాలయములకు ఆయా సర్కిళ్ళలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు అనుగుణంగా సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు.

ఒక్కో పోలింగ్ కేంద్రానికి 10 కిట్లు ఎన్నికల విధులు నిర్వహించే వారి కొరకు అందజేయబడుతుంది అని వెల్లడించారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 500 మి.లీ ల శానిటైజర్లు 5 చొప్పున అందించేందుకు 60,000 శానిటైజర్లు సిద్ధం చేయడం జరిగింది అని పేర్కొన్నారు. నోడల్ వైద్య అధికారులు పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు భౌతిక దూరం పాటించేలా, శానిటైజర్లు ఉపయోగించేలా, మాస్కులు ధరించేలా చూడాలని సూచించారు. సర్కిళ్ళ వారీగా నియమించబడిన నోడల్ వైద్య అధికారులు, ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు స్టేట్ మెంట్ రూపంలో జత చేసినట్టు వెల్లడించారు. ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 4 న రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: