గ్రేటర్ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. నేతలందరూ ప్రచారానికి స్వస్తి పలికి పోలింగ్‌ కేంద్రాలపై దృష్టిసారించారు. ఇప్పటికే ఏజెంట్ల నియామకపు ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. నియోజకవర్గంలో డిసెంబరు 1న పోలింగ్‌ జరుగుతుంది. ఒక్కో డివిజన్‌లో 50 కేంద్రాలకు  పైబడి 70 కేంద్రాలకు  లోబడి ఉన్నాయి. వీటిలో అత్యధికంగా సమస్యాత్మకమైన బూతులే అధికంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఈవిఎం మిషన్లకు బదులు బ్యాలెట్‌ పేపర్లతో ఓటింగ్‌ జరుగుతోంది. కనుక చాలా బూతుల్లో ఘర్షణలు జరిగే అవకాశం లేకపోలేదు. ఎన్నికల ప్రక్రియ అంతా ఆగమేఘాల మీద జరిగిపోవడంతో చాలా బూత్‌లు పోలింగ్‌కు అనుగుణంగా లే వు. పోలింగ్‌కు మరో ఒక రోజు గడువు ఉన్నప్పటికి కొన్ని కేంద్రాల వద్ద చిన్నపాటి మరమ్మత్తులను చేపట్టారు.  

ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఆదివారం పర్యవేక్షించారు. పోలింగ్‌ జరిగే భవనాలను, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టిసారించారు. ఓటర్లకు అనువుగా లేని బూత్‌లను గుర్తించి తక్షణ మరమ్మత్తులను చేపట్టారు. మల్లేపల్లి, రెడ్‌హిల్స్, గుడిమల్కాపూర్, అహ్మద్‌ నగర్‌ డివిజన్లలోని కొన్ని పోలింగ్‌ బూత్‌లలో చిన్నపాటి మరమ్మత్తులు చేపట్టారు. బ్యాలెట్‌ బాక్స్‌లు, ఎన్నికల సిబ్బంది సోమవారం సాయంత్రానికి ఆయా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోనున్నారు.

అయితే నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌లను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల జాబితాను పోలీసులు ఇప్పటికే తెచ్చుకున్నారు. ఆయా బూత్‌ల పరిధిలో ఉండే రౌడీషీటరును బైండోవర్‌ చేశారు. సీసీ కెమెరాలను అమర్చారు. అదనపు బలగాలతో ఇప్పటికే మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. పోలింగ్‌ బూత్‌లలో జరిగే సన్నివేశాలను, సంఘటనలను తెలుసుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా పోలీసు అధికారులు సిద్ధమయ్యారు. ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని  పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా లేకుండా సహకరించాలని కోరుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఒకరి మధ్య ఒకరు కనీస దూరం ఉండేలా క్యూ లైన్‌లో నిలబడాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: