హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగ సవాల్ విసిరారు. అక్రమ వలసదారులను తరిమికొట్టడంపై లిఖితపూర్వకంగా లెటర్ ఇవ్వాలని, అప్పుడు తమ తడాఖా ఏంటో చూపిస్తామని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆదివారం అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. సికింద్రాబాద్‌లోని వారాసిగూడలో రోడ్‌షో అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలపై విమర్శలతో విరుచుకుపడ్డారు.

దమ్ముంటే బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను వెళ్లగొట్టాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మాటిమాటికీ ఊగిపోతున్నారని, సత్తా ఉంటే లిఖిత పూర్వకంగా చెప్పాలని అన్నారు. ఒకవేళ ఆయన వైపు నుంచి అలాంటి లేఖ ఏదైనా వస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పారు. పార్లమెంటులో అక్రమ వలసదారుల గురించి ఎప్పుడు చర్చ జరిగినా వాళ్ల తరపున మాట్లాడేదెవరో ప్రజలందరికీ బాగా తెలుసని, వాళ్లే ఇప్పుడు తమపై అనవసరమైన సవాళ్లు విసురుతున్నారని అమిత్ షా విసుర్లు విసిరారు.

'నేను ఏ చర్య తీసుకున్నా పార్లమెంటులో వాళ్లు గందరగోళం చేస్తారు. ఆయన ఎలా గట్టిగా అరుస్తారో మీ అందరికీ తెలుసు కదా..? టీవీ లైవ్‌‌లో చూసే ఉంటారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను వెళ్లగొట్టాలంటూ వారే స్వయంగా చెప్పమనండి. వెంటనే ఆ పని చేసి చూపిస్తా. కేవలం ఎన్నికల్లో మాట్లాడితే సరిపోదు. పార్లమెంటులో కూడా అదే స్వరాన్ని వినిపించాలని అమిత్‌షా సూచించారు.

నిజాం సంస్కృతి నుంచి హైదరాబాద్‌కు విముక్తి కలిగించాలని, అప్పుడే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అమిత్‌షా అన్నారు. ఆ పని తాము చేస్తామని, ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు లోబడి హైదరాబాద్‌ను మోడ్రన్ సిటీగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తామని చెప్పారు. వంశపారంపర్య పాలనకు, మభ్యపెట్టే రాజకీయాలకు తాము చరమగీతం పాడతామని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే ఇటీవల ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఒవైసీ.. హైదరాబాద్లో అక్రమంగా రోహింగ్యాలు ఉంటే, హోం మంత్రి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే వారిని దేశం నుంచి తరిమేయకుండా వట్టి ఆరోపణలు చేస్తూ ఎందుకు కూర్చున్నారని, ప్రజలను మభ్య పెట్టేందుకే బీజేపీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: