జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారాలు ముగిశాయి. ఆయా పార్టీల అభ్యర్థులు ఆదివారం సాయంత్రం వరకు జోరుగా ప్రచారాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారాలు ముమ్మరంగా నిర్వహిస్తూ ఎన్నికల నిబంధనల మేరా ప్రచారాలకు ముగింపు పలికారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు డిసెంబర్ 1న జరిగే ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లలో బిజీ అయ్యారు.

అయితే డివిజన్ పార్టీల అభ్యర్థులు ఆయా డివిజన్లలో ప్రచారాలు నిర్వహించారు. ఈ మేరకు మచ్చలేని కార్పొరేటర్‌గా డివిజన్‌ను అభివృద్ధి చేశానని, మరోసారి కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదిస్తే అదే స్పూర్తితో నిజాయితీ, నిబద్దతతో సేవ చేస్తానని  మూసారంబాగ్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ అభ్యర్థి తీగల సునరితరెడ్డి స్పష్టం చేశారు. డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. అనంతరం కార్యకర్తలతో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ ఓటర్‌ను కలిశానని, వారి నుంచి విశేష స్పందన లభించిందన్నారు. డివిజన్‌ వాసులు టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఎప్పుడో డిసైడ్‌ అయ్యారన్నారని తెలిపారు. మత విద్వేషాలు, రెచ్చగొట్టే పార్టీలకు చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసిందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా, మిషన్ కాకతీయ వంటి పథకాలు ప్రజలకు అందించిందన్నారు. అన్ని రంగాల ప్రజలకు వ్యాపారం చేసుకోవడానికి రుణ సదుపాయాన్ని కల్పించిందన్నారు. అలాగే ఇటీవల వరద బాధితులకు రూ.10వేల  ఆర్థిక సాయాన్ని అందించిందన్నారు. వరద సాయం అందనివారికి డిసెంబర్ 7వ తేదీ తర్వాత తిరిగి అందజేస్తామన్నారు.

 కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, సీనియర్‌ సిటీజన్స్ సలహాలు, సూచనలతో ముందుకు వెళ్తూ ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఓటర్లకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీలతో ప్రజలకు ఓరిగిందేమి లేదన్నారు. స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రఘునందన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ధర్మేందర్, నూలీ శ్రీధర్‌రావు, శశిధర్‌రావు, బట్టుదాసురావు, అంబారి పవన్, పీటర్, ప్రవీణ్, ఆండాలు, శ్రవణ్‌గుప్త, నర్సింహ్మరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: