గ్రేటర్‌లో మరొకసారి గులాబీ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం ఆదివారం ముగియడంతో ఆర్‌కేపురం డివిజన్ లో పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలసి ప్రచారం నిర్వహించారు. పాదయాత్ర ద్వారా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయభారతికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఆర్‌కేపురం గడ్డపై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నగర సమగ్రాభివృద్ధికి కంకణం కట్టుకుని పని చేస్తున్నారని ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు.

నగరానికి 20 వేల లీటర్ల వరకు ఉచిత నీటి సరఫరాను గృహాలతో పాటు అపార్ట్‌ మెంట్‌ వాసులకు కూడా కల్పించటం జరుగుతోందని అన్నారు. అన్ని కులవృత్తుల వారికి సముచిత న్యాయం చేస్తున్నారని అన్నారు. క్షౌర శాలలు, సెలూన్లు, దోబీఘాట్‌లు తదితర వాటికి ఉచిత విద్యుత్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. యాదవులకు గొర్రెలు, ముదిరాజ్‌ లకు ఉచిత చేప పిల్లల పంపిణీ, మోటారు వాహనాలు, గౌడ కులస్తులతో సహా అందరి అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే కరోనా దృష్ట్యా ఆస్తి పన్నులో 50 శాతం రాయితీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారని మంత్రి గుర్తు చేశారు.

ఆగిన వరద సాయం డిసెంబర్‌ 7 నుంచి తిరిగి ప్రారంభం అవుతుందని అన్నారు. 67 వేల కోట్ల రూపాయలతో నగర అభివృద్ధికి బాటలు వేసినట్లు తెలిపారు. పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఏ ఇతర రాష్టాలు కూడా అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి అన్నారు. రైతు బంధు లాంటి పథకాలు కేంద్రంతో సహా వివిధ రాష్టాలు అమలు చేశాయని తెలిపారు.

కరోనా సమయంలోనూ, వరదల్లోనూ ప్రజలకు అండగా నిలిచింది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అన్నారు. నాడు కనిపించని వాళ్లు నేడు అవకాశాల కోసం ప్రజల ముందుకు వస్తున్నారని, వారికి ఓటుతో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉందని, నగర అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. డిసెంబర్‌ 1వ తేదీన జరిగే ఎన్నికల్లో ఆర్‌కేపురం డివిజన్‌ అభ్యర్థి మురకుంట్ల విజయభారతితో పాటు అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.

వరదలు వచ్చి హైదరాబాద్‌ మునిగిపోతే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ప్రజలు గుర్తుకురాలేదా, ఇప్పుడు హైదరాబాదీల ఓట్ల కోసం ఇక్కడికి వస్తున్నారని ఆమె విమర్శించారు. సీఎం కేసీఆర్‌ పాలనలో హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉందని తెలిపారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు అందరూ కలిసి మెలిసి హైదరాబాద్‌లో ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు. అన్నివర్గాల పండుగలకు ప్రభుత్వం సముచిత గౌరవం కల్పిస్తున్నదన్నారు. రంజాన్, దసరా, క్రిస్మస్‌కు బట్టల పంపిణీతో పాటు రంజాన్‌కు ఇఫ్తార్‌ విందును ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తున్నదన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉంటే.. బీజేపీ ప్రజల మధ్య చిచ్చుపెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని  విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: