గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ప్రజలు ఎక్కడా కొవిడ్ నిబంధనలు పాటించలేదనే విషయం బహిరంగ రహస్యం ప్రచారం ముగిసే సమయానికి అన్ని ప్రధాన పార్టీలు రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించాయి. కేసీఆర్ బహిరంగ సభలో మాత్రం కొవిడ్ నిబంధన మేరకు ఏర్పాట్లు చేసినా.. ఒక్కసారి సభ మొదలయ్యాక జనాలను కంట్రోల్ చేయడం ఎవరి వల్లా కాలేదు. బీజేపీ తరపున మహామహులు రంగంలోకి వచ్చి ప్రచారం చేసి వెళ్లిపోయారు. ఆయా సభలు, సమావేశాలు, ర్యాలీలకు భారీగా జన సమీకరణ జరిగింది. ఆ పార్టీ కార్యక్రమాల్లో కూడా సామాజిక దూరం, మాస్క్ లు అనే నిబంధన కార్యకర్తలు పాటించలేకపోయారు. దీంతో తెలంగాణలో కొవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అక్టోబర్ నెలలో తెలంగాణలో రోజుకి 40వేలనుంచి 42వేల కొవిడ్ టెస్ట్ లు జరుగుతుండేవి. వీటిలో సగటున 1400కేసులు కొత్తగా నమోదయ్యేవి. టెస్ట్ ల సంఖ్య 45వేలు దాటితే పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 1500కు చేరువయ్యేది. అలాంటి పరిస్థితుల్లో నవంబర్ 20నుంచి కరోనా కేసుల సంఖ్యలో భారీగా తగ్గుదల నమోదైంది. పరీక్షల సంఖ్య 42వేలకు తగ్గకపోయినా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం వెయ్యికి దిగొచ్చింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 46,280మందికి కొవిడ్ పరీక్షలు జరపగా కేవలం 805మందికి మాత్రమే పాజిటివ్ గా తేలింది. ఇప్పటి వరకూ రోజు వారీ నమోదవుతున్న కొత్త కేసులు వెయ్యిలోపే ఉండటం గమనార్హం.

ఇక ప్రచార పర్వం ముగిసిన తర్వాత దాదాపుగా అందరూ ఇళ్లకే పరిమితమవుతారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టెస్ట్ ల సంఖ్య పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అదే జరిగితే, కేసుల సంఖ్య కూడా పెరిగ్ అవకాశం ఉందని అంచనా వేస్తోంది. మరోవైపు ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థులు, ప్రధాన పార్టీల నేతలు.. కొంతమంది పూర్తిగా ఇళ్లకే పరిమితమైపోయారు. అత్యవసరం కాబట్టి కనీస జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజల్లో తీరిగిన నేతలంతా ఇప్పుడు ఇళ్లలోనే ఉంటున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కొవిడ్ కేసులు పెరిగితే అది కచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల వల్లే అనేది నిజమవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: