ఎన్డీఏ ప్ర‌భుత్వానికి రైతుల నుంచి నిర‌స‌న సెగ త‌గులుతోంది. రైతుల‌కు ఎంతో మేలు చేకూరుతుంద‌ని పేర్కొంటూ కేంద్ర‌ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని వేలాదిమంది రైతులు ఢిల్లీకి చేరుకున్న విష‌యం తెలిసిందే. ఢిల్లీలో నిర‌స‌న వినిపించేందుకు వివిధ మార్గాల్లో ర్యాలీకి అనుమ‌తివ్వ‌వాల‌ని పోలీసుల‌ను కోరారు. ఇందుకు పోలీసుల నుంచి అనుమ‌తి ల‌భించ‌క‌పోవ‌డంతో ఉద్రిక్త‌త కొన‌సాగుతోంది. ఆదివారం ఢిల్లీ సరిహద్దులో వేలాదిగా గుమిగూడిన రైతులు కేంద్రం సూచించిన బురారీ పార్క్‌కు వెళ్లడానికి నిరాకరించారు. తాము నిర్దేశించుకున్న జంతర్ మంతర్‌లోనే నిరసనచేయడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఢిల్లీ సరిహద్దుల్లోనే తమ ఆందోళనలు కొనసాగిస్తామని, దేశరాజధానిలోకి వెళ్లే ఐదు మార్గాలను దిగ్బంధిస్తామని స్పష్టం చేశారు.


భారతీయ కిసాన్ యూనియన్ క్రాంతికారి పంజాబ్ యూనిట్ అధ్యక్షుడు సుర్జీత్ సింగ్ మాట్లాడుతూ, తాము బురారీ పార్క్‌కు వెళ్లమని తేల్చేశారు. అది పార్క్ కాదని, ఒక బహిరంగ జైలుగా తమకు తెలిసిందని వివరించారు.రైతు సంఘాలు ప్ర‌ధానంగా నాలుగు డిమాండ్లను కేంద్ర ప్ర‌భుత్వం ముందు పెట్టాయి. మూడు నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని, పంటకు కనీస మద్దతు ధర గ్యారంటీ ఇవ్వాలని, పంటనష్టాలను కాల్చివేస్తే విధించే జరిమానాలు తొలగించాలని, ఎలక్ట్రిసిటీ ఆర్డినెన్స్ నిలిపేయాలని డిమాండ్ చేశాయి. ఎలక్ట్రిసిటీ అమెండ్‌మెంట్ బిల్ 2020తో కరెంట్ బిల్లులపై రైతులు పొందే సబ్సిడీ రద్దు కానుంది.


ఇదిలా ఉండ‌గా  రైతుల నిర‌స‌న నేప‌థ్యంలో బీజేపీ నేత‌లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, నరేంద్రసింగ్ తోమర్ తదితరులు హాజరయ్యారు.. ఓవైపు రైతుల ఆందోళనలు ఉధృతం అవుతున్న సమయంలో.. ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. రైతులకు చర్చలకు సిద్ధమని.. ప్రభుత్వం ప్రకటించినా.. వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవడమే ప్రధాన డిమాండ్‌ అని రైతు సంఘాల నేతలు తెగేసి చెప్పడంతో.. ప్రభుత్వానికి ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో.. రైతుల ఆందోళనకు ఎలా పులిస్టాప్ పెట్టాలి.. వారికి ఎలా నచ్చజెప్పాలి, ఆందోళన ఎలా విరమింపజేయాలి అనే దానిపై బీజేపీ అగ్రనాయత్వం దృష్టిసారించిన‌ట్లుగా యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: