జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపుకోసం ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టేలా లేవు పార్టీలు. ప్రచార పర్వం పూర్తి కావడంతో ఇప్పుడు స్థానికంగా కాలనీ సంఘాలు, కుల సంఘాలతో మంతనాలు జరుపుతున్నారు అభ్యర్థులు. ముఖ్యంగా సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి మీటింగ్ లు జరుగుతున్నాయని సమాచారం. కొన్ని సంఘాలు నేరుగా డబ్బులు డిమాండ్ చేస్తుంటే.. మరికొంతమందికి తాము గెలిస్తే ఫలానా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని నచ్చజెబుతున్నారు అభ్యర్థులు.

నగరంలో స్థిరపడిన ఇతర రాష్ట్రాలవారి ఓట్లు అధికంగా ఉన్న డివిజన్లలో అభ్యర్థులు గెలుపుకోసం అనేక యత్నాలు చేస్తున్నారు. ఆ వర్గాల ప్రజల్లో పేరున్నవారిని కలసి తమకు ఓటేయించాలని కోరుతున్నారు. రాజస్థానీ, గుజరాతీ కుటుంబాల్లో పెద్దలు చెప్పిన పార్టీకే ఓట్లు వేయడం ఆనవాయితీ. ఈ రాష్ట్రాల వారు కొన్నిచోట్ల ఉమ్మడి కుటుంబాలుగా నివసిస్తున్నారు. అలాంటి చోట్ల వారి కుటుంబ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారు అభ్యర్థులు. ఆయా ఓట్లన్నీ తమకే పడేలా చూడాలని అభ్యర్థిస్తున్నారు.

ముఖ్యంగా ఏపీనుంచి వలస వెళ్లిన కుటుంబాలను ఆకట్టుకునేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. కులం పేరు చెప్పి, ప్రాంతం పేరు చెప్పి వీరిని ఓట్లు అడుగుతున్నారని తెలుస్తోంది. ఆయా కుల సంఘాల నేతలతో చర్చలు జరుపుతున్నారట. వారితో చెప్పిస్తే ఒక్క ఓటు కూడా బైటకు పోకుండా పడుతుందనేది అభ్యర్థలు ఆశ. అందుకే ఈ ఆలోచన చేస్తున్నారు. తెలంగాణలోని ఇతర జిల్లాలకు చెందినవారి ఓట్లను పొందడానికి అక్కడి నేతలు చర్చలు జరుపుతున్నారు. ఆయా జిల్లాలకు చెందిన నేతలతో ఇక్కడ సామాజిక వర్గాల వారీగా రాత్రి పూట సమావేశాలు నిర్వహిస్తున్నారట. పోలింగ్‌ సమయం సమీపించేకొద్దీ ప్రతీ ఓటునూ కీలకంగా భావిస్తూ అపార్టుమెంట్ల సంఘాలతో పాటు కాలనీల్లో వీధులవారీగా ఉన్న ఇళ్ల ఓటర్ల మద్దతు కోసం మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఎన్నికలకు ఒకరోజు మాత్రమే సమయం ఉండటంతో.. పార్టీ ఓట్లపైకంటే.. ఇలా పక్కన ఉన్న ఓట్లకోసం అభ్యర్థులు ఎక్కువగా ఆశపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: