ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఆదివారం అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం జోరుగా చేశాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ విస్తృత ప్రచారం చేసింది. చిక్కడపల్లి త్యాగరాయగాన సభ అధ్యక్షుడు కళా జనార్ధనమూర్తి నివాసంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గాంధీ నగర్ డివిజన్ ఎన్నికల ఇన్‌‌చార్జి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరంతరం ప్రజల కోసమే పనిచేసే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ మత రాజకీయం చేయడం తప్ప అభివృద్ధి గురించి మాట్లాడదన్నారు. దేశ జీడీపీ అభివృద్ధి అంశాలపై మాట్లాడకుండా బీజేపీ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేస్తున్న బీజేపీ నేతల విచిత్ర ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బేవరేజేస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీ ప్రసాద్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డా.ఆయాచితం శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

ఆదివారం గాంధీనగర్ డివిజన్‌లో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో రోడ్‌షో, పాదయాత్ర నిర్వహించారు. అనంతరం డివిజన్ అభ్యర్థి పద్మనరేశ్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మొన్నటివరకు ఎమ్మెల్యే ఎన్నికల్లో మనకు బండ్ల గణేష్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేది ఆ స్థానాన్ని ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భర్తీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రోజుకో వింత విషయాలతో ప్రజల ముందుకొస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల దీవెనలు ఉన్నంత వరకు కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదన్నారు. ప్రతిఒక్కరూ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మనరేశ్‌కు ఓట్లు వేసి టీఆర్ఎస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: