ఇంతకుముందెన్నడూ లేనివిధంగా సాగిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. చివర్రోజున కావడంతో పార్టీ అభ్యర్థులందరూ ఉధృతంగా ప్రచారం చేశారు. జరుగుతున్నది గ్రేటర్ ఎన్నికలే అయినా ఇవి మినీ అసెంబ్లీని తలపిస్తున్నాయి. ప్రధానంగా చెప్పాలంటే దుబ్బాక ఎన్నికల ప్రభావం ఈ ఎన్నికలపై బాగా పడిందనే చెప్పాలి. గ్రేటర్ ఎన్నికలే తెలంగాణలో బీజేపీ గ్రాండ్ ఎంట్రీగా తీసుకుంది. ఏకంగా పార్టీ జాతీయ అగ్రనాయకత్వాన్నే ప్రచారానికి దించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, జవదేకర్, మహారాష్ట్ర మాజీ సీఎం ఫడణవీస్ తదితరులు ప్రచారానికి వచ్చారు.

ఎన్నికల ప్రచారానికి ముగింపు రోజున పార్టీ వ్యూహకర్త, హోంమంత్రి అమిత్‌షా వచ్చారు. ఆయన నిర్వహించిన రోడ్‌షోలకు విశేష స్పందన లభించింది. మంత్రి కేటీఆర్ అన్నీ తానై టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఈసారి 104 సీట్లు గెలుస్తామని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. గత ఎన్నికల్లో 150సీట్లకు గాను 99 స్థానాలను టీఆర్ఎస్ గెలిచిన విషయం విదితమే. కాంగ్రెస్ తరఫున టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి జోరుగా ప్రచారం చేశారు. రేవంత్‌రెడ్డి ప్రచారాలకు విశేష స్పందన లభించింది. టీడీపీ, ఎంఐఎం కూడా పోటాపోటీగా ప్రచారం చేశాయి.  

ఇదిలా ఉండగా, ఆదివారం ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి ఎం.సుప్రియా నవీన్‌గౌడ్‌కు మద్దతుగా ముషీరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె, మహిళామోర్చా కమిటీ రాష్ట్ర నాయకురాలు విజయలక్ష్మి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచి గోల్కోండపై కాషాయం జెండా ఎగురవేస్తామని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు బీజేపీ ప్రచారానికి భయపడుతున్నారన్నారు. అమిత్‌షా సారథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు పెద్దఎత్తున గెలిచి టీఆర్ఎస్‌కు గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సదానంద్, రాంరెడ్డి, శ్రీవివాస్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: