గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ మరి కొద్ది గంటంలో మొదలు కాబోతోంది. ఆ మీదట ఓటరన్న దయ, నేతల ప్రాప్తం అన్నట్లుగానే సీన్ ఉంటుంది. మహా కార్పోరేషన్ మీద కూర్చునే కొత్త పెత్తందారు ఎవరో కానీ మూసి ఉన్న ఆ పిడికిలీ నుంచి ఏ అలికిడీ లేదు. ఏ ఆనవాళ్ళూ కానరావడం లేదు. అంతా తుఫాన్ ముందర నిశ్శబ్దం. గ్రేటర్ లో పాగా వేసి తీరాలని ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ పడి మరి చేసిన ప్రచారం నిజంగా చెవులకు ఎక్కిందా. ఎక్కితే అది అనుకూలమా, వ్యతిరేకమా.

మొత్తానికి పోలింగునకు గడువు దగ్గరపడుతున్నా కూడా ఓటరు నాడి మాత్రం అంతు చిక్కడంలేదుట. ఎవరికి వారు ధీమాగా ఉన్నా కూడా కూడా ప్రజా తీర్పు ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఒకరా ఇద్దరా ఎనభై లక్షల మంది జనం ఇచ్చే తీర్పు ఇది. అందుకే ఇది అతి పెద్ద సమరం అయింది. సౌత్ లో అతి పెద్ద సిటీగా లక్షలాది మందికి సౌభాగ్యనగరంగా ఉన్న హైదారాబాద్ తన భాగ్య‌ విధాత ఎవరో తేల్చుకోవడానికి కొద్ది గంటలు మాత్రమే వ్యవధి ఉంది.

అయితే ఈసారి మాత్రం చాలా భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరేంటి అన్నది జనం దగ్గర మొత్తం జాతకం ఉంది. ఒక ఓటు అనే ఆయుధంతో వారు గట్టిగానే సౌండ్ చేయనున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో జనం తీర్పు కఠినంగా ఉంటుందా ఉంటే ఎవరికి అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటికి చాలా ఎన్నికలను అంతా చూశారు.  తాయిలాలూ రాయితీలు ఇవన్నీ కూడా ఇపుడు షరా మామూలు అయిపోయాయి. ఏ ఎన్నికకు ఆ ఎన్నికగా ఓటరన్న తెలివి మీరుతున్నాడు.  కీలెరిగి వాత పెడుతున్నాడు. దాంతో ఈసారి ఎన్నికల్లో ఎన్ని చిత్రాలు చూపిస్తాడో అన్న గుబులు అయితే అందరిలో ఉంది. అందుకే ఈ ఒక్కరాత్రి గడవనీ అనుకుంటున్నారుట. నరాలు తెగే టెన్షన్ లో నేతాశ్రీలు ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: