గ్రేటర్ ఎన్నికల చివర్రోజున అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ గాంధీనగర్ డివిజన్‌లో ప్రచారం వేగం మరింత పెంచి ప్రచారం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలే గ్రేటర్ ఎన్నికలో కూడా పునరావృతమవుతాయని బీజేపీ నాయకులు అంటున్నారు. స్థానిక పరిస్థితుల లోపం వల్లే దుబ్బాక ఉప ఎన్నికలో ఓడిపోయామని టీఆర్ఎస్ అంటోంది. ఏది ఏమైనప్పటికీ ఈసారి ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగింది. ఆదివారం గాంధీనగర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి ఎ.పావని వినయ్ కుమార్‌కు మద్దతుగా నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రోడ్‌షో నిర్వహించారు.

 ఈ రోడ్‌షోను చిక్కడపల్లి ఈసేవ, బాపూనగర్, తదితర ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకుని అవినీతిపాలనను అంతంచేయాలని నగర ప్రజలను కోరారు. గత ఎన్నికల్లో పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తానన్నారు కదా మరీ ఇప్పటి వరకు ఎన్ని కట్టించారో లెక్క చెప్పండని టీఆర్ఎస్‌ను సూటిగా ప్రశ్నించారు. మార్చిలో జరగాల్సిన ఎన్నికలు హడావుడిగా ఎందుకు నవంబర్‌లో పెట్టారో సమాధానం చెప్పాలన్నారు. నిజంగా నగర ప్రజలపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి సానుభూతి ఉండి ఉంటే వరద సాయం పంపిణీ అనంతరం ఎన్నికలకు వెళ్లి ఉండేవారన్నారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకే టీఆర్ఎస్.. బీజేపీపై అర్థంలేని ఆరోపణలు చేస్తోందని ఎంపీ అరవింద్ అన్నారు.

వినాయకుడిపై గులాబీ కండువా కప్పిన ఘనత కల్వకుంట్ల కవితకే దక్కిందన్నారు. ఆమె ట్రైనింగ్‌తో ఇక్కడి గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి డివిజన్ ప్రజలందరికీ నివాళులర్పించిందని ఎద్దేవా చేశారు. డివిజన్ ప్రజలందరూ తమ ఓటును బీజేపీ అభ్యర్థి పావనికి వేయాలని కోరారు. పావని వినయ్ కుమార్‌ను గెలిపిస్తే విజయోత్సవ సభకు వస్తానని ధర్మపురి అరవింద్ తెలిపారు. ఈ రోడ్‌షోలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేవైఎం నగర అధ్యక్షుడు ఎ.వినయ్ కుమార్, రమేష్ రామ్, ప్రఫుల్ రాంరెడ్డి, తమ్మ పద్మజ, రత్నసాయిచంద్, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: