సోమవారం ప్రారంభం అయిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా మొదలయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతులు, వరద బాధితులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. డిసెంబర్ 31లోగా రైతులకు పంట నష్ట పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. వ్యవసాయ సాయంపై ముఖ్యమంత్రి సభలో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు కూడా బాగా పెరిగాయి. రైతులకు కొంత మేర నష్టం జరిగినా వారిని యుద్ధప్రాతిపదికన ఆదుకుంటున్నాం. ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్‌లో ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. మాది రైతు పక్షపాత ప్రభుత్వం అని గర్వంగా చెప్తున్నా. ఖరీఫ్ సీజన్‌లో పంట నష్టపోయిన రైతులను.. అదే సీజన్‌లోనే నష్టపరిహారం చెల్లించడం చరిత్రలో ఇదే తొలిసారి. రూ. 126 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని అందించాం. అక్టోబర్‌లో వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు.. నవంబర్‌లో రూ. 132 కోట్ల నష్టపరిహారం అందించాం.


ఇటీవలే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భీభత్సం సృష్టించిన నివర్ తుఫాను వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహాయక శిబిరాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి రూ. 500 ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించాం. ఈ నిర్ణయం వల్ల ప్రతి కుటుంబానికి రూ. 2 వేలు ఆర్థిక సాయం అందుతుంది. అలాగే డిసెంబర్ 15లోగా పంట నష్టం అంచనాలను పూర్తి చేయాలని ఆదేశించాం. డిసెంబర్ 31లోగా పంట నష్ట పరిహారం చెల్లించాలని నిర్ణయించాం. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు కూడా అందిస్తాం. ఇళ్లు, పశువులు, ఇతర నష్టాలను కూడా డిసెంబర్ 15లోగా అంచనా వేస్తాం. డిసెంబర్ 31లోగా నష్టపరిహారం అందిస్తాం. అలాగే ఈ తుఫాను, వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాం. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను, విద్యుత్ లైన్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాం. వర్షాల వల్ల రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చాం. రంగు మారిన ధాన్యంతో పాటు మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం. ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తాం. 2020 ఖరీఫ్ నుంచి బీమా బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఖరీఫ్‌ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి బీమా చెల్లించాం. పంటల ఉచిత బీమా కోసం ప్రభుత్వం రూ.1,030 కోట్లు చెల్లించింది’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: