జరుగుతున్నవి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు.. కానీ పార్టీల పోరాటం చూస్తుంటే చావో రేవో అన్నట్లుగా అనిపించింది. జీహెచ్‌ఎంసీ స్థానిక ఎన్నికకు పార్టీలు ఎందుకింత ప్రాధాన్యమిస్తున్నాయి. మహానగర సమరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ చూడని ఎన్నికల ప్రచారం ఇప్పుడు జరిగింది. మామూలుగా అయితే ఇది  హైదరాబాద్ స్థానిక సంస్థ ఎన్నిక. కేవలం హైదరాబాద్‌లో నీళ్ళు.. డ్రైనేజీ.. రోడ్లు..  పారిశుద్ధ్యం.. వంటి వసతులపైనే గ్రేటర్ పాలకమండలి పనిచేస్తుంది. వాటి అభివృద్ధినే చూస్తుంది. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో 74 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తీర్పు ఇవ్వనున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ప్రజాసేవ సంగతి అంటుంచితే, రాజకీయ ఆధిపత్యం కోసం పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం చోవారేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు మూడేళ్ల ముందు జరుగుతుండటంతో.. గ్రేటర్ ఎన్నికలు పార్టీలన్నింటికీ కీలకంగా మారాయి.

 ఐదు లోక్‌సభ స్థానాలు.. 24 అసెంబ్లీ నియోజకవర్గాలు.. 150 డివిజన్ల  సమాహారమే గ్రేటర్‌ హైదరాబాద్‌.  తెలంగాణకు రాజధాని. రాజకీయ కార్యక్షేత్రం.. రాష్ట్రంలో నాలుగోవంతు.. ప్రజలకు ప్రతిరూపం. అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డవారు ఉండటంతో.. రాష్ట్రమంతటి.. ప్రజాభిప్రాయంగానూ భావించవచ్చు.  119 సీట్లున్న అసెంబ్లీపైన ఈ ఎన్నికల తీర్పు ప్రభావం పడుతుందని అధికార, ప్రతిపక్షాలు గట్టిగా నమ్ముతున్నాయి.

పార్టీలకు ఈ ఎన్నికలు ఎందుకింత ప్రతిష్టాత్మకంగా మారాయో ఓ సారి పరిశీలిస్తే.. టీఆర్ఎస్.. తెలంగాణ ఛాంపియన్. రెండుసార్లు గెలిచి.. ఆరేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తోంది. సంక్షేమం, అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచామని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌కు దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. ప్రజాభిప్రాయం మారుతోందా? అన్న అనుమానాలు అటు అధికారపార్టీలో.. ఇటు ప్రతిపక్షంలో మొదలయ్యాయి. ఈలోగా గ్రేటర్ ఎన్నికలు దూసుకొచ్చాయి. రాజధానిలో జరిగే ఈ ఎన్నికల్లో గెలిచి..  తెలంగాణ ప్రజల నమ్మకం ఏమాత్రం తమపై చెరిగిపోలేదని నిరూపించుకోవాల్సిన పరిస్థితి.


మరింత సమాచారం తెలుసుకోండి: