గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం ముగిసింది. చివరి రోజై. ఆదివారం అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ముగించాయి. అయితే సోమవారం కొత్త పరిస్థితి తలెత్తింది. మందు, డబ్బు పంపిణీ ప్రారంభమైంది. పరిస్థితులు ఇలా మారడంపై పలు పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీలు అధికార టీఆర్ఎస్‌పై మూకుమ్మడిగా అభియోగాలు చేస్తున్నారు.  బీజేపీ నేతలు టీఆర్ఎస్‌‌ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా గులాబీ దళంపై విమర్శలు ఎక్కు పెట్టారు.

కాంగ్రెస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ సోమవారం నాడు మాట్లాడారు. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌ నేతలు అధికారాన్ని అడ్డు పెట్టుకొని అడ్డదిడ్డంగా సంపాదించారని, ఇప్పుడు ఆ సొమ్మును బయటకు తీసి ఓట్లు కొనడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని కాంగ్రెస్ శ్రవణ్‌ మండిపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఎన్నికల్లో పోటీ చేయడం వృధా అనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం కూడా ఈ విషయంలో కఠినంగా స్పందించడం లేదని, ప్రభుత్వానికి బానిసలా పనిచేస్తోందని ఆరోపించారు. ఇలా చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదని, దీని కన్నా ఎన్నికలు పెట్టే బదులు నేరుగా కార్పొరేటర్‌ సీట్లు అమ్మకానికి పెడితే సరిపోతుందని విమర్శలు గుప్పించారు. నగరంలో పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ నేతలు మద్యం, డబ్బు పంచుతూ కనిపించిన ఘటనల నేపథ్యంలో శ్రవణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా, నగరంలో చైతన్య పురి కాలనీలో టీఆర్ఎస్ నేతలు మద్యం పంపినీ చేస్తూ బీజేపీ నేతల కంట పడ్డారు. దాంతో బీజేపీ నేతలు టీఆర్‌ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహం చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీసును ముట్టడించే ప్రయత్నం చేశారు. అప్పుడు రెండు పార్టీల నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు కూడా బాహా బాహీకి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు పార్టీల నేతలను చెదర గొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: