జీహెచ్ఎమ్ సీ ఎన్నికల హోరాహోరీలో ఆయా పార్టీల  నేతలు తమ తమ హామీలను వెలిబుచ్చారు. వారొచ్చి ఏమిచ్చారు.. మేమొస్తే ఏయే అభివృద్ధి పనులు చేస్తామో అన్నింటినీ వివరించేశారు. ఇక కేవలం మిగిలింది మాత్రం ప్రజలు ఏ పార్టీని నమ్మి తమ అమూల్యమైన  ఓటును దేనికి వేయబోతున్నారనేది మాత్రమే. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ పార్టీల నాయకులు తమ బలాబలగాలను ప్రజలకు వివరించే పనిలో పడ్డారు. అందులోనూ తమ పార్టీల గొప్పతనం గురించేమో కాని అవతల  పార్టీ అధికారం లోకి  రాకుండా ముందస్తు జాగ్రత్తలు మాత్రం బాగానే తీసుకుంటున్నారని అనిపిస్తున్నది. అదెలాగంటారా.. అదేనండి తమ పార్టీ గొప్పతనం గురించి వివరిస్తూనే.. ప్రత్యర్థి పార్టీపై నిప్పులు చెరుగుతూ.. ఆ పార్టీలతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థులను తీవ్రంగా ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేస్తూ.. ఉన్నవి లేనివి అన్ని చెబుతూ.. ఓటర్లను తమ వైపు తిప్పుకొనే పనిలో ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


ఇలా చెప్తేనే కదా అవతల పార్టీ బలహీనతలు తెలిసి తమ పార్టీ గెలిసే అవకాశముంటుందని భావిస్తుంటారు. ఈ విషయం పక్కన  పెడితే... ఈ గ్రేటర్ ఎన్నికల పోటీలో గులాబి జెండా, కమలం గుర్తు, హస్తం గుర్తులు నువ్వా.. నేనా అంటూ తమ తమ ప్రచారాలను ముగించాయి. ఈ ప్రచారంలోనూ ఇంటింటికీ.. గల్లీ గల్లీకి, రోడ్ షో లు నిర్వహిస్తూ తమ ప్రచారాలను హోరెత్తించాయనే చెప్పుకోవచ్చు. అందులోనూ  కమలం పార్టీ మాత్రం తన ప్రచారాన్ని ఒక రేంజ్ లో చేసిందనే చెప్పుకోవచ్చు. ప్రముఖ నేతలందరూ ఈ ప్రచారంలో పాల్గొంటూ తమ విధి విధానాలను తెలియజేశారు. కాగా ఈ పార్టీకి ప్రజల నుంచి విశేష ఆదరణ కూడా లభించిందనే చెప్పుకోవచ్చు.


అయితే, ఎన్నికల ప్రచార ముగింపు నేపథ్యంలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో  నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి తమ పార్టీ గురించి మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికలు, ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ .. ప్రజల సంక్షేమం, నగర అభివృద్ధి జరగాలంటే అది కేవలం ఒక్క బీజేపీతోనే సాధ్యమవుతుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందులోనూ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టైతే తాము ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.  అలాగే పార్టీ నుంచి ప్రచారంలో భాగంగా అభ్యర్థులు, కార్యకర్తలు.. ఓటర్ల ఇంటికి రాకపోయినా ఓటర్లే పెద్దమనసుతో పోలింగ్ లో పాల్గొని ధర్మాన్ని కాపాడే బీజేపీని గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మరీ ముఖ్యంగా ఈ రాజకీయాలల్లో అవినీతిని, కుటుంబ రాజకీయాల రూపురేఖలు లేకుండా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా టీఆర్ఎస్ హామీల పేరుతో చేస్తున్న మోసాలను ఈ ఎన్నికల ద్వారా అంతం చేయాలని కిషన్ రెడ్డి తెలియజేశారు.


డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో జరుగుతున్న అవినీతిపై ఆ పార్టీ నేతలు కొంచెం కూడా మాట్లాడటం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ చేస్తున్న మోసాలు ప్రజలందరికీ తెలుసుగనక ఈ ఎన్నికల్లో మాత్రం తెరాసా కట్టుకథలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని ఆయన స్పష్టం చేశారు. అటాగే కల్వకుంట్ల కుటుంబమేమీ రాజకీయాలకు శాశ్వతం కాదంటూ కిషన్ రెడ్డి ఘాటు వాఖ్యలు చేశారు. అలాగే కేవలం దుబ్బాక, హైదరాబాద్ లకే పరిమితమైన బీజేపీ రాజకీయ పోరాటాన్ని ఊరూర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అవినీతిని, ధర్మాన్ని రక్షించే బీజేపీని  గెలిపించాలని కిషన్ రెడ్డి ప్రజలకు విన్నవించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: