గ్రేటర్ హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం మహేశ్వరం . ఇక్కడ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నవి రెండే డివిజన్లు. ఒకటి ఆర్ కే పురం, రెండోది సరూర్ నగర్. జీహెచ్ఎంసీ ఏర్పాటుకు ముందు ఎల్బీ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ రెండు ప్రాంతాలు మలక్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండేవి. నియోజకవర్గాల పునర్విభజనలో  రెండు డివిజన్లుగా మహేశ్వరం అసెంబ్లీ పరిధిలోకి వెళ్లాయి.

ఆర్కేపురం డివిజన్‌లో 54వేల 242 మంది ఓటర్లు ఉన్నారు. ఇక సరూర్ నగర్ డివిజన్లో 59వేల 626 మంది ఓటర్లున్నారు. ఇతర ప్రాంతాల నుంచి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు. నల్గొండ, పాలమూరు జిల్లా వాసులు అధికం. ఈ రెండు డివిజన్లలో బీసీలు ఎక్కువగా ఉంటారు. గెలుపోటములను ప్రభావితం చేసే సామాజిక వర్గం కూడా ఇదే. మైనార్టీల ఓట్లు కూడా కీలకంగానే ఉంటాయి. ఆర్కే పురంలో బ్రాహ్మణులు, వైశ్యులు పెద్దసంఖ్యలోనే ఉంటారు. ఇక్కడ బీజేపీకి కొంత అనుకూల ఓటు బ్యాంకు ఉంది. ఇక సరూర్‌నగర్లో బీసీ ఓటు బ్యాంకు ఉంది. ఇక్కడ కొంత అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్రభావం కనిపిస్తోంది.

2009లో జరిగిన ఆర్ కే పురం, సరూర్ నగర్ డివిజన్లకు జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 2016లో జరిగిన ఎన్నికల్లో ఆర్ కే పురం డివిజన్‌ను బీజేపీ గెలుచుకోగా...  సరూర్‌నగర్లో గులాబీ జెండా రెపరెపలాడింది. సిట్టింగ్ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి మరోసారి టీఆర్‌ఎస్‌ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక దుబ్బాక గెలుపుతో జోష్ మీద ఉన్న బీజేపీ... గ్రేటర్లోని ఈ రెండు డివిజన్ల మీద కన్నేసింది. ఆర్ కే పురం సిట్టింగ్ స్థానం కావడంతో బీజేపీ ఈ డివిజన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాగే సరూర్‌నగర్‌లో పాగాకు ప్లాన్ చేస్తోంది. ఇక కాంగ్రెస్ కూడా తమ వంతుగా పోటీచేస్తోంది. రెండు డివిజన్లలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అంతగా పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: