గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ మరి కొద్ది గంటంలో మొదలు కాబోతోంది. మహా కార్పోరేషన్ మీద కూర్చునే కొత్త పెత్తందారు ఎవరో కానీ మూసి ఉన్న ఆ పిడికిలీ నుంచి ఏ అలికిడీ లేదు. ఏ ఆనవాళ్ళూ కానరావడం లేదు. అంతా తుఫాన్ ముందర నిశ్శబ్దం. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సర్కిల్ ‌– 8 డీసీ, సహాయ ఎన్నికల అధికారి రిచా గుప్తా పర్యవేక్షణలో చాంద్రాయణగుట్ట, బార్కాస్, రియాసత్‌నగర్, లలితాబాగ్, ఉప్పుగూడ, జంగమ్మెట్, కంచన్‌బాగ్‌ డివిజన్లలో 126 లొకేషన్లలోని 296 పోలింగ్‌ బూత్‌లలో కోవిడ్‌ నిబంధనలలో భాగంగా శానిటైజేషన్‌ చేశారు.

సాయంత్రం 4 గంటల అనంతరం బండ్లగూడలోని అరోరా న్యాయ కళాశాలలోని డీఆర్‌సీ కేంద్రం నుంచి ఆర్‌.వోలు బ్యాలెట్‌ బాక్స్‌లను ప్రిసైడింగ్‌ అధికారుల ద్వారా భారీ పోలీస్‌ బందోబస్తు నడుమ పోలింగ్‌ బూత్‌లకు తరలించారు. పోలింగ్‌ బూత్‌లలో నీటి సదుపాయం, కరెంట్, వికలాంగులకు ఏర్పాట్లు అన్ని చేసినట్లు డీసీ రిచా గుప్తా తెలిపారు. ఎన్నికల పోలింగ్‌ ను పురస్కరించుకొని సున్నితమైన పాతబస్తీలో డీసీపీ గజరావు భూపాల్‌ పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాల నుంచి వచ్చిన బలగాలను బూత్‌ల వారిగా విధులు కేటాయించారు. ముఖ్యంగా సున్నిత, అతి సున్నితమైన, వల్నరబిలిటీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. రౌడీషీటర్లను ఇప్పటికే బైండోవర్‌ చేసిన పోలీసులు.....తుపాకి కలిగిన వారి నుంచి కూడా డిపాజిట్‌ చేయించుకున్నారు.

ఇక నగర వ్యాప్తంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ హడావిడి సాగుతున్నప్పటికీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో మాత్రం మజ్లిస్‌ గాలే వీస్తుంది. ఉప్పుగూడ, జంగమ్మెట్‌ డివిజన్లలో మాత్రం బీజేపీ, మజ్లిస్‌ల నడుమ పోటా పోటీ ఉండగా.. మిగిలిన చాంద్రాయణగుట్ట, బార్కాస్, కంచన్‌బాగ్, రియాసత్‌నగర్, లలితాబాగ్‌లలో మాత్రం మజ్లిస్‌కే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. రెండో స్థానం కోసం బీజేపీ, టీఆర్‌ఎస్‌లు పోటీ పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: