సవాళ్లు, ప్రతిసవాళ్లు..ఆవేశకావేశాలతో సమావేశాల తొలిరోజే ఏపీ శాసనసభ హీటెక్కింది. పంటనష్ట పరిహారంపై చర్చ సందర్భంగా ప్రభుత్వం తీరును నిరసిస్తూ విపక్షనేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలతో సహా స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు. ఎంతకూ వెనక్కు రాకపోవడంతో13 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ .. ఒక్కరోజు పాటు సస్పెండ్ చేశారు. చంద్రబాబు తీరును ఆక్షేపిస్తూ సభ తీర్మానం చేసింది.

శాసనసభ తొలిరోజు సమావేశాల్లో పంట నష్ట పరిహారంపై చర్చ .. సభలో మాటల యుద్ధానికి దారి తీసింది. తుపాను పరిహారంపై జరిగిన చర్చలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేసిన ఆరోపణలకు .. సీఎం జగన్ సమాధానమిచ్చారు. ఇదే అంశంపై మాట్లాడేందుకు సిద్ధమైన విపక్షనేతను  అధికార పక్ష సభ్యులు అడ్డు తగిలారు.  దీంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై మండిపడుతూ టీడీపీ సభ్యులతో కలిసి స్పీకర్‌ పోడియం ముందు భైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.

సభ్యులు ఎంతకూ వినకపోవడం, సభ అదుపుకాకపోవడంతో.. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి పేర్నినాని తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం.. చంద్రబాబు సహా 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్కరోజు పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన సభ్యులు సభ నుంచి వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు. వీరు సభను వీడకపోవడంతో మార్షల్స్ సభ నుంచి తరలించారు.

సభలో చంద్రబాబు తీరును సీఎం జగన్‌ తప్పుబట్టారు. కావాలనే పోడియం ఎదుట బైఠాయించారని.. రౌడీయిజం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కర్నూలు ఎమ్మెల్యేని ఏం పీకుతారని చంద్రబాబు అన్నారన్నారు సీఎం జగన్. కళ్లు పెద్దవి చేసి, వేలు చూపించి చంద్రబాబు బెదిరించారు. సీబీఎన్ అంటే కరోనాకు భయపడే నాయుడన్నారు సీఎం జగన్.

చంద్రబాబు తీరును ఆక్షేపిస్తూ అసెంబ్లీ లో తీర్మానం ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి బుగ్గన. చంద్రబాబు ప్రవర్తన చూసి మతి చెడిపోయిందన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. తగిన చర్యలు తీసుకోవాలని సభ కోరిందని.. దీన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: