పాతబస్తీలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు సజావుగా జరిగేందుకు దక్షణ మండలం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా బలగాలను దింపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద నిఘా పెంచారు. ఈ మేరకు పాతబస్తీలోని పలు కీలక ప్రాంతాల్లో విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. అక్కడక్కడా మిగిలిపోయిన పార్టీ జెండాలు, బ్యానర్లను సంబంధిత పోలీసులు తొలగించారు. దక్షిణ మండలంలో సెక‌్షన్‌-144 కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక‌్షన్‌-144 అమల్లో ఉంటుంది. పార్టీల నాయకులు, అభ్యర్థులు పోలింగ్‌ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఉండాలని దక్షిణ మండలం పోలీసు అధికారులు తెలిపారు.

దక్షిణ మండలంలోని అన్ని డివిజన్లలో పోలింగ్‌ ప్రశాంతంగా జరగడానికి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు పర్యవేక్షణలో అదనపు బలగాలు శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నాయి. అదనపు ఎస్పీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, పోలీసులు సిబ్బంది, ఏఆర్‌హెచ్‌జీ సెక‌్షన్ల బలగాలు పర్యవేక్షించనున్నాయి. ఈ మేరకు దక్షిణ మండలంలో 30 ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలుగా పోలీసు అధికారులు గుర్తించారు. ఇందులో హుస్సేనీఆలం, కామాటిపురా, కాలాపత్తర్‌, చార్మినార్‌, శాలిబండ తదితర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ప్రాంతాలను గుర్తించారు. ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
పోలింగ్‌ కేంద్రంలో కేవలం నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని దక్షిణ మండలం పోలీసు అధికారులు తెలిపారు. నలుగురు తప్పా.. ఆయా పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు మంత్రులకు అనుమతి లేదన్నారు. ఎవరైనా పోలింగ్‌ బూత్‌లకు 100 మీటర్ల దూరంలోనే ఉండాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు.

పాతబస్తీలో పోలింగ్‌ ప్రశాంతంగా జరగడానికి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే 100కి ఫోన్‌ చేయాలన్నారు. లేదా దక్షిణ మండలం డీసీపీ ఫోన్‌:94906 16476, చార్మినార్‌ ఏసీపీ ఫోన్‌: 94906 16477, మీర్‌చౌక్‌ ఏసీపీ ఫోన్‌: 94906 16515, సంతోష్‌నగర్‌ ఏసీపీ ఫోన్‌: 94906 16533, ఫలక్‌నుమా ఏసీపీ ఫోన్‌: 94906 16158 నంబర్లకు సంప్రదించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: