జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ ఓటర్ల పంట పండింది. ప్రలోభాల పేరుతో వస్తున్న గిఫ్ట్ లతో ప్రజలు పరమానందపడిపోతున్నారు. కార్తీక పౌర్ణమి కూడా అభ్యర్థులకు బాగా కలిసొచ్చింది. దీంతో గెట్ టు గెదర్ లు పెట్టుకుని మరీ గిఫ్ట్ లు ఇచ్చి పంపిస్తున్నారు. నేరుగా ఓటుకు నోటు ఇవ్వకుండా ఓటర్లను ఇలా సంతృప్తి పరస్తున్నారు.
జీహెచ్‌ఎంసీలో ఈసారి ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగింది. చాలా డివిజన్లలో నువ్వా– నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. దీంతో అభ్యర్థులు చివరాఖరి అస్త్రాన్ని బయటకు తీశారు. ఓటర్లకు బహుమతులు, కానుకలు ఇచ్చి తమ వైపుకి తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా సోమవారం అంతా ఈ గిఫ్ట్ ల హడావిడే జరిగిందని తెలుస్తోంది.

వరుసగా సెలవులు రావడం, సోమవారం కార్తీకపౌర్ణమి కావడంతో ఓటర్లంతా ఇంటి వద్దనే ఉన్నారు. ఇదే చక్కటి అవకాశంగా భావించిన నేతలు తమ తెలివితేటలకు పదును పెట్టారు. గల్లీ నాయకులను రంగంలో దింపి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కానుకలు అందించారు. అంతేకాదు అలా కానుకలు అందుకున్నవారంతా పోలింగ్‌ బూత్‌కు వచ్చే దాకా వారితో టచ్‌లో ఉండాలని అనుచరులు, కార్యకర్తలను ఆదేశించారు అభ్యర్థులు.

ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ప్రలోభాల పర్వం మొదలైంది. ప్రత్యర్థులకంటే ముందుగా తాము డబ్బు పంచాలనే ఆలోచనతో చాలామంది హడావిడి పడ్డారు. టౌన్‌ షిప్ లు, అపార్ట్‌మెంట్లపె పూర్తి స్థాయిలో దృష్టిసారించారు. ఓటరు లిస్టు ఆధారంగా తమకు అనుకూలంగా ఉండే వారికి ఆహ్వానాలు పంపి మరీ గిఫ్ట్ ప్యాక్ లు చేతిలో పెట్టారు. కార్తీక నోములు, వ్రతాలు, బర్త్ ‌డేల పేరిట విందులు నిర్వహించారు. వీటికి హాజరైన మహిళలకు రిటర్న్‌ గిఫ్ట్‌ల రూపంలో వెండి వస్తువులు, చీరలు, ఇతరత్రా కానుకలు ఇచ్చి ఆకట్టుకునే యత్నం చేశారు. ఇక బర్త్‌డే పార్టీల్లో, గెట్‌ టు గెదర్ ‌లలో పురుష ఓటర్లను మందు విందులతో ప్రసన్నం చేసుకున్నారు. అదనంగా నగదు పంపిణీ చేసి ఓట్లు వేయాలని కోరారు. అదే సమయంలో బస్తీలు, మురికివాడల్లో చాలామంది గల్లీ లీడర్ల సాయంతో ఓటుకు ఇంతని కుటుంబాలతో గంపగుత్తగా మాట్లాడుకుని నోట్లను పంచారు.

వరుసగా సెలవలు రావడంతో అసలు ఓటర్లు బైటకు వచ్చి ఓటు వేస్తారా అనే అనుమానం కూడా నాయకుల్లో ఉంది. దీంతో ఓటర్లను పోలింగ్ బూత్ ల వరకు చేర్చి, వారితో ఓటు వేయించే బాధ్యత గల్లీలీడర్లు, అపార్ట్ మెంట్ల సెక్రటరీలు తీసుకున్నారు. కానుకలు తీసుకున్న అభ్యర్థులను పోలింగ్ కేంద్రం వరకు తీసుకెళ్లి ఓటు వేయించే బాధ్యత వీరికి అప్పగించారు అభ్యర్థులు. మొత్తమ్మీద కార్తీక మాసం సందర్భంగా అభ్యర్థులు గిఫ్ట్ ల పేరుతో హడావిడి చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: